కాన్వాసుపై చారిత్రక పండగ

2 Jun, 2015 01:15 IST|Sakshi
కాన్వాసుపై చారిత్రక పండగ

తెలంగాణ సంస్కృతిని చాటుతున్న చిత్రకారులు
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్

 
 ఇద్దరు చిత్రకారులు.. పేర్లు దేవేందర్‌గౌడ్, రామ్మోహన్. ఒకరిది మహబూబ్‌నగర్ జిల్లా బోయినపల్లి. మరొకరిది వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి. ఇద్దరిలోనూ కామన్‌గా ఉన్నది.. కళలపై మమకారం. ఇదే వీరిద్దరినీ కలిపింది. కలిసి కాన్వాసుపై తెలంగాణ చరిత్రను పరిచి.. సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నారు. తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు దేశ పర్యటన చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో వారు తెలంగాణ ‘చిత్రాన్ని’ ఆవిష్కరిస్తున్నారు.

తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని వీరు బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్ ఆర్ట్ గ్యాలరీలో ‘కాకతీయన్ హెరిటేజ్’ పేరుతో గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రకారులను ‘సాక్షి’ పలకరించినప్పుడు చిత్రాల చరిత్రను వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
 - సాక్షి, సిటీబ్యూరో
 
 ‘ఈ సిటీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ నగరమే నా కళకు ప్రాణం పోసింది’ అని సంతోషంగా చెప్పారు దేవేందర్‌గౌడ్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల తాలూకా బోయినపల్లి గ్రామానికి చెందిన ఈ చిత్రకారుడు.. మూడేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. తెలంగాణ సంస్కృతిని, కాకతీయుల పాలనలో వెలసిన చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని చాటేందుకు ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా అవతారమెత్తారు. పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన మరో ఆర్టిస్టు రామ్మోహన్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచీ వరంగల్‌లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను వెళుతుండేవాడిని. కుంభమేళా తర్వాత అంత పెద్దగా జనాలు వచ్చే ఈ జాతర ప్రత్యేకతను నలుగురికీ చెప్పాలనుకున్నా. అందుకు కుంచె పట్టా’ అని చెప్పారు.
 
 కళే కలిపింది ఇద్దరిని..
 ‘మా ఇంట్లో నేను చిన్నోడిని. మా నాన్న ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఉన్న ఆసక్తి కుంచె పట్టేలా చేసింది. అలా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఎఫ్‌ఏ చేశా. ఇదే సమయంలో నాకు దేవేందర్ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఓసారి సమ్మక్క-సారలమ్మ జాతరను చూశాం. అప్పటి నుంచే మన తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఫిక్స్ అయిపోయాం’ అని చెప్పుకొచ్చారు రామ్మోహన్.
 
 ఢిల్లీలో కూడా చేశాం..
 ‘తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు ఢిల్లీలోని ఆలిండియా ఫైన్‌ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీలో ఇప్పటికే ఎగ్జిబిషన్ చేశాం. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని మరికొన్ని కొత్త పెయింటింగ్స్‌తో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. మన తెలంగాణలోనైనా మన చారిత్రక కట్టడాలకు తగిన గుర్తింపు లభిస్తుందని కోరుకుంటున్నా’మన్నారు ఈ కళా ద్వయం.
 
 ఓ కుంచెది ‘శిల ్ప’ చరిత్ర..
  ‘800 ఏళ్ల క్రితం నాటి రామప్ప గుడి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇంత అద్భుత శిల్ప సంపద ఉన్నా అనుకున్నంత గుర్తింపు రాకపోవడం ఆలోచింపచేసింది. రామప్ప ఓ శిల్పి. కళాకారులకు కాకతీయులు గుర్తింపు ఇచ్చినా ఇప్పటివారు నిర్లక్ష్యం చేయడం బాధించింది. ఈ శిల్పాలు శివుని అనాటమీ (స్ట్రక్చర్).. విష్ణువు ఆకృతిని పోలి ఉంటాయి. రామప్ప గుడి శిల్ప సంపదను కళ్లకు కట్టినట్టు చూపేందుకు కుంచెను ఆయుధంగా వాడుకున్నా’ అని గర్వంగా చెప్పారు దేవేందర్‌గౌడ్.
 
 మరో కుంచెది ‘మహా జాతర’..
  ‘భారతదేశంలో భారీగా భక్తులు హాజరయ్యేది కుంభమేళాకే. తర్వాత అంత భక్తజనం తరలి వచ్చేది ‘సమ్మక్క- సారక్క’ జాతరకే. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈ గిరిజన అక్కాచెల్లెళ్లు చూపిన తెగువను ప్రపంచమే చెప్పుకుంటుంది. మిగతా జాతర్లకు ఈ తిరునాళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మిగతా చోట్ల బంగారంతో మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ బెల్లాన్ని సమర్పిస్తుంటారు. ఇదే సీన్‌ను పెయింటింగ్ ద్వారా చూపించా. సమ్మక్క గద్దె, సారక్క గద్దెను చూస్తే అలానే నిలబడి చూడాలనిపిస్తునే ఉంటుంది. అందుకే ఆ చిత్రాలను గీశా’ అంటూ చెప్పారు రామ్మోహన్.

మరిన్ని వార్తలు