‘సూపర్‌ బగ్‌’ విక్రయదారులపై కేసులు నమోదు చేయాలి

30 Jan, 2017 02:46 IST|Sakshi
  • తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ ఆదేశాలు
  • ‘సాక్షి’కథనంపై కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని యాంటిబయోటిక్స్‌ మందులు వరదలా ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపర్‌బగ్‌ డ్రగ్స్‌ తెలంగాణలో విచ్చలవిడిగా వెలుగు చూస్తున్నాయి. మూడో తరానికి చెందిన హెచ్‌1 డ్రగ్స్‌ కేటగిరీలోని 50 సూపర్‌డ్రగ్‌ మందులు మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నట్లు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ ఎం.అమృతరావు వెల్లడించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘సూపర్‌బగ్‌ భయోత్పాతం’కథనంపై ఆయన స్పందించారు. కథనం ఎంతో చైతన్యవంతంగా ఉందని ఆయన కొనియాడారు. యాంటీబయోటిక్స్‌ను పుట్నాల్లా తింటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    రాష్ట్ర వ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు చేసి సూపర్‌బగ్‌ డ్రగ్స్‌ ఉంటే వెంటనే సీజ్‌ చేయాలని... సంబంధిత దుకాణాదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. హెచ్‌1 సూపర్‌బగ్‌ డ్రగ్స్‌ విచ్చలవిడిగా ఉపయోగించడంవల్ల... అవి బ్యాక్టీరియాపై పనిచేసే పరిస్థితి లేకుండా పోయింద న్నారు. సాధారణంగా వీటిని అధిక ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు ఐసీయూల్లో ఉపయోగి స్తారన్నారు. హెచ్‌1 కేటగిరీల్లోని డ్రగ్స్‌ల్లో దగ్గు మందులు కూడా ఉన్నాయని, వీటి వాడకంతో అధికంగా మత్తు వస్తుందన్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు ఈ దగ్గు మందులను ఒక ముఠా సరఫరా చేస్తోందన్నారు.

    రెండు ప్రిస్క్రిప్షన్లు రాయాలి...
    హెచ్‌1 డ్రగ్‌లను వైద్యులు సూచించాల్సి వస్తే... రెండు ప్రిస్కిప్షన్లు రాయాలని అమృతరావు చెప్పారు. ఒకటి రోగి వద్ద, మరొకటి మందుల దుకాణాదారులు ఉంచుకోవాలన్నారు. వాటిని ఎందుకు విక్రయించారో తమకు తెలపాలని ఆయన ఆదేశించారు. ఇష్టారాజ్యంగా విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. సూపర్‌బగ్‌లను మూడు నాలుగు కంపెనీలు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కాగా, ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించి... మత్తు కలిగించే 2,040 కోడిస్టార్‌ దగ్గు మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు