సెప్టెంబర్ 3 నుంచి ఎంసెట్-3 హాల్‌టికెట్లు

31 Aug, 2016 19:25 IST|Sakshi
సెప్టెంబర్ 3 నుంచి ఎంసెట్-3 హాల్‌టికెట్లు
► 11వ తేదీన రాత పరీక్ష, ఈసారి పక్కాగా ఏర్పాట్లు
► ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ మిషన్
► పరీక్ష ప్రారంభానికి గంట ముందే వేలిముద్రల సేకరణ
► వెబ్‌సైట్‌లో 2011 నుంచి ఎంసెట్ మోడల్ పేపర్లు
 
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహణకు ఎంసెట్ కమిటీ పక్కా చర్యలు చేపడుతోంది. సెప్టెంబరు 11వ తేదీన జరిగే రాత పరీక్షను పూర్తిస్థాయిలో నిఘా నీడన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 
 
పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించింది. పలుమార్లు మెడికల్ ఎంసెట్‌కు హాజరవుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. 1981లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు, ఎంబీబీఎస్ చేస్తున్న వారు ఎందుకు ఎంసెట్‌కు హాజరవుతున్నారన్న అంశంపై లోతైన విచారణ జరుపాలని పోలీసు శాఖను కోరింది. మరోవైపు ఈసారి పరీక్ష కేంద్రాల్లో జామర్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 9వ తేదీ వరకు విద్యార్థులు ఎంసెట్-3 వెబ్‌సైట్ నుంచి (tseamcet.in) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

ఎంసెట్ -2 లీకేజీ వ్యవహారంలో చోటుచేసుకున్న తప్పిదాలు, పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించింది. ఎంసెట్-2 పరీక్ష సమయంలో పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. పరీక్షకు హాజరయ్యే పలువురు విద్యార్థుల నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్ డాటా) తీసుకోలేకపోయారు. బయోమెట్రిక్ పరికరాలు మొరాయించడంతో వేలి ముద్రలు తీసుకోకుండా కొంతమందిని పరీక్షకు అనుమతించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎంసెట్-2 పరీక్ష పత్రం లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చిన క్రమంలో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పక్కా చర్యలు చేపడుతోంది.

11వ తేదీన జరుగనున్న ఎంసెట్-3 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 56,153 మంది (ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న వారంతా) హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకు బయోమెట్రిక్ మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఎంసెట్-2లో ప్రతి 250 మందికి ఒక మెషిన్ ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి వేలిముద్రలు సేకరించింది. ఈసారి ప్రతి 200 మందికి ఒక మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒకవేళ సాంకేతిక సమస్యలు తలెత్తినా అప్పటికప్పుడే మరో మెషిన్ ఏర్పాటు చేసేందుకు అదనంగా బయోమెట్రిక్ పరికరాలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్-2లో పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు నుంచి వేలిముద్రలు స్వీకరించేలా చర్యలు చేపట్టగా, ఎంసెట్-3లో పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకునేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థుల వెసలుబాటు కోసం 2011 నుంచి జరిగిన అన్ని ఎంసెట్ పరీక్షల ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
మరిన్ని వార్తలు