మా ఇంట్లో నేనే ఆర్థిక మంత్రిని: జమున

13 Mar, 2017 11:05 IST|Sakshi
మా ఇంట్లో నేనే ఆర్థిక మంత్రిని: జమున

హైదరాబాద్‌ : రాష్ట్రానికి  ఆయన  ఆర్థికమంత్రి అయినప్పటికీ, ఇంట్లో మాత్రం ఆయన సతీమణే ఆర్థిక మంత్రి. ఆయనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌. మరికొద్దిసేపట్లో ఆయన శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఈటల భార్య జమునతో 'సాక్షి' ముచ్చటించింది.

'మా ఇంట్లో ఆర్థిక మంత్రిని నేనే. ఇంట్లో వ్యవహారాలన్నీ నేనే చూస్తా. మంత్రిగా, రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే ఈటలకు కుటుంబం పూర్తి సహకారం అందిస్తుంది. ఉద్యమ కాలం నుంచి ఆయన సమయం మాకు సరిగా దొరకడం లేదు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత సీఎం కేసీఆర్‌తో పాటు ఈటల, కేబినెట్‌కు ఉంది. ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నాం.

బంగారు తెలంగాణ సాధించాలంటే ఇంకా కష్టపడాలని ఈటల అంటుంటారు. ఇక ఈ బడ్జెట్‌తో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. నోట్ల రద్దు వల్ల కొంత ఇబ్బందిపడ్డాం. ఆ సమయంలో నా దగ్గరున్న మూడున్నర లక్షలు బ్యాంకులో వేశా. అంతకంటే ఎక్కువ డబ్బులు లేవు' అని జమున తెలిపారు.

కాగా ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని తెలిపారు.