వారం ముందే వేసవి సెలవులు?

14 Apr, 2016 08:42 IST|Sakshi
వారం ముందే వేసవి సెలవులు?

ఎండల తీవ్రత నేపథ్యంలో సర్కారు యోచన
 
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలోని పాఠశాలలకు వారం రోజుల ముందే వేసవి సెలవులు ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి ఈ సెలవులపై నిర్ణయం తీసుకునేలా కలెక్టర్లకు అధికారం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈనెల 10వ తేదీ నుంచే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు వినతి పత్రాలు అందజేశాయి. ఈ నేపథ్యంలో వారం ముందే సెలవులు ప్రకటిస్తే బాగుంటుందన్న దిశగా చర్చ జరిగినట్లు తెలిసింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఒకేసారి వేసవి సెలవులు ప్రకటించాలా, లేక ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి జిల్లాల పరిధిలో సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలా? అన్న అంశం తెరపైకి వచ్చింది. జిల్లాల పరిధిలో సెలవులను ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశముంది. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి, 15న శ్రీరామనవమి సందర్భంగా సెలవులు వచ్చాయి. దీంతో శనివారం దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పాత షెడ్యూల్ ప్రకారం 23వ తేదీ వరకు పాఠశాలలు నడుస్తాయి. ముందే సెలవులు ఇస్తే.. ఈ సోమవారం లేదా మంగళవారం నుంచే వేసవి సెలవులు అమల్లోకి వస్తాయి.

మధ్యాహ్న భోజనం పెట్టేదెవరు?
రాష్ట్రంలో 231 కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. అయితే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులెవరూ బడులకు రారు. దీంతో విద్యార్థులకు పెట్టే భోజనం పర్యవేక్షణ ఎవరు చూడాలన్న దానిపై విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ఉపాధ్యాయులను పాఠశాలలకు రప్పించి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను చేయించాలా, లేక క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో చేయించాలా, లేక గ్రామ పంచాయతీలకే అప్పగించాలా? అన్న అంశాలపై ఆలోచనలు చేస్తోంది. టీచర్లను వేసవి సెలవుల్లో పాఠశాలల్లో పనిచేయిస్తే వారికి పనిచేసినన్ని రోజులు సంపాదిత సెలవులు (ఎర్న్‌డ్ లీవ్స్) ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలోని 1.25 లక్షల మంది టీచర్లకు అలా ఇవ్వాలంటే ఒక్క నెలకే దాదాపు రూ.300 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అది ప్రభుత్వానికి భారమయ్యే నేపథ్యంలో.. ఏం చేయాలన్న అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది.

>
మరిన్ని వార్తలు