-

గడువు.. 60 రోజులు

3 Nov, 2015 10:57 IST|Sakshi
గడువు.. 60 రోజులు

సాక్షి, హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చివరిసారిగా(వన్‌టైం) అక్రమాల క్రమబద్ధీకరణ జరుపుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోడానికి 60 రోజుల గడువు విధించింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ 2015 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి రాగా.. భవనాల క్రమబద్ధీకరణ మాత్రం నవంబర్ 3 నుంచి అమల్లోకి రానుంది.

 కటాఫ్ కీలకం..
 క్రమద్ధీకరణకు కటాఫ్‌గా 2015 అక్టోబర్ 28వ తేదీని ఖరారు చేశారు. ఈ కటాఫ్ లోపు రిజిస్ట్రరైన లే అవుట్లు/ప్లాట్లతో పాటు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించనున్నారు. అయితే 1985 జనవరి 1కి ముందు నాటి భవనాలకు మినహాయింపు కల్పించారు. 1985 జనవరి 1 నుంచి 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ తప్పనిసరి. కటాఫ్ తేదీ నిర్ధారణ కోసం లే అవుట్లు/ప్లాట్ల విషయంలో సేల్స్ డీడ్ రిజిస్ట్రేషన్ తేదీని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. కటాఫ్ లోపు నిర్మితమైన భవనాలను గూగుల్ మ్యాప్స్‌లోని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గుర్తిస్తారు.

 క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే..
 క్రమబద్ధీకరించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినా ఉపయోగించుకోకుండా నేరాన్ని కొనసాగిస్తున్నట్లు పరిగణించి భారీ జరిమానాలను విధించనున్నారు. స్థానిక పురపాలికలు క్రమబద్ధీకరించుకోని భవనాల కూల్చివేత, ఇతర తీవ్ర చర్యలకు ఉపక్రమించనున్నాయి. సదరు భవనం ఉన్న స్థలంలో తదుపరి నిర్మాణాలకు సైతం అనుమతులు నిరాకరించనున్నారు. ఇక అక్రమ లే అవుట్లకు సాధారణ కేటగిరీ కింద నల్లా కనెక్షన్, డ్రైనేజీ, సీవరేజీ సేవలను నిలిపేయనున్నారు. అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. అక్రమ లే అవుట్లలో భవనాల నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడంతో పాటు ఒకవేళ నిర్మిస్తే కూల్చివేయనున్నారు. దరఖాస్తు తర్వాత కూడా నిర్మాణాలను కొనసాగిస్తే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు వసూలు చేసిన ఛార్జీలను జప్తు చేసుకోనున్నారు.

 చార్జీల మోత...
 గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలు 40-70 శాతం వరకు పెరిగాయి. క్రమబద్ధీకరణ చార్జీలకుతోడుగా అభివృద్ధి రుసుం సైతం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే కనీసం 50 శాతం చార్జీలను లేదా రూ.10 వేలను డీడీ రూపంలో తొలుత చెల్లించాలి. భవనం/లే అవుట్ మార్కెట్ విలువపై 20-100 శాతం వరకు అభివృద్ధి రుసుంను విధించనున్నారు. లే అవుట్ల విషయంలో చదరపు మీటర్‌కు రూ.200-750 వరకు క్రమబద్ధీకరణ చార్జీలను వసూలు చేయనున్నారు. భవనాల విషయంలో చదరపు మీటర్‌కు వ్యక్తిగత నివాస భవనాలపై రూ.15-200 వరకు, వాణిజ్య భవనాలపై రూ.30-400 వరకు చార్జీలను విధించనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు/అపార్ట్‌మెంట్లు/ప్లాట్ల విషయంలో చార్జీలు భారీగా ఉండనున్నాయి. కాగా, మురికి వాడల్లోని ప్లాట్లను మాత్రం స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి చదరపు మీటరుకు రూ.5 రుసుంతో క్రమబద్ధీకరించనున్నారు.

 అక్రమాలపై క్రిమినల్ కేసులు: తలసాని
 రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ మేరకు భవన నిర్మాణ చట్టాన్ని సవరించాలని కోరామన్నారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్‌తో కలిసి సోమవారం సచివాలయంలో అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. తన నేతృత్వంలోని అధ్యయన కమిటీ అందజేసిన నివేదికలోని సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. అక్రమ లే అవుట్లు, భవనాలను కట్టడి చేసేందుకు ఈ కింది సిఫారసులు చేశామన్నారు.

► టౌన్ ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం న్యాయ సలహా తీసుకోవాలి
► అక్రమ లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయరాదు
► అక్రమ కట్టడాలను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం/ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి
►  భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్‌ల అనుమతులకు సింగిల్ విండో విధానం తేవాలి
►  భవిష్యత్తులో వెలిసే అక్రమ నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను మూడింతలు వసూలు చేయాలి.
►  భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించాలి

మరిన్ని వార్తలు