పదవీ విరమణ @ 60

3 Jan, 2017 02:29 IST|Sakshi
పదవీ విరమణ @ 60

ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఏపీ తరహాలో రెండేళ్లు పెంచాలని ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లు
రెండేళ్లలో లక్ష మందికిపైగా రిటైర్‌ కానున్న ఉద్యోగులు
రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల చెల్లింపులతో ఖజానాపై ఆర్థిక భారం
ఏటా రూ.5 వేల కోట్లు అవసరం
రెండేళ్లకు పెంచితే ఆ మేరకు ఆదా చేయొచ్చని ప్రభుత్వ యోచన


సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్ల పాటు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు విరమణ ప్రయోజనాల చెల్లింపులు ఆర్థికంగా భారంగా మారటంతో సర్కారు ఈ దిశగా మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు 58 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ ఉద్యోగుల పదవీ కాల పరిమితిని 60 ఏళ్లకు పెంచింది. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ రెండేళ్ల వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు పదో పీఆర్‌సీ అమల్లోకి వచ్చినప్పట్నుంచి రిటైరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రయోజనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఖజానాపై ఆర్థిక భారం పెరిగిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో  3.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లోగా 60 వేల మంది ఉద్యోగులు రిటైరవుతారని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు లెక్కలేస్తున్నాయి. రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లించే ప్రయో జనాలకు ఏటా దాదాపు రూ. 5 వేల కోట్లు కావాలి. ఆ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ప్రయోజనాలేంటి?
రిటైర్‌మెంట్‌ వయో పరిమితిని పెంచితే ఒనగూరే ప్రయోజనాలను ప్రభుత్వం విశ్లేషించుకుంటోంది. దీంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఉద్యోగుల ఖాళీలు ఏర్పడే పరిస్థితిని నివారించే వీలుందని అంచనా వేసింది. మరోవైపు రిటైర్మెంట్‌ ప్రయోజనాలకు చెల్లించే నిధులు ఆదా చేసి.. అభివృద్ధి సంక్షేమ పనులకు మళ్లించే వెసులుబాటు లభిస్తుందని యోచిస్తోంది. దీంతోపాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఇప్పటివరకు ఉన్న గుర్తింపు కొనసాగుతుందని భావిస్తోంది. అదే సమయంలో రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంచితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతుందనే కోణంలోనూ ఆరా తీస్తోంది.

నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే..
ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయటంతో కొత్త ఉద్యోగావకాశాలకు గండి పడింది. దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అంతమేరకు కొత్త పోస్టులు లేకుండా పోయాయని నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంచితే మరో రెండేళ్ల పాటు రిక్రూట్‌మెంట్లు ఆగిపోయే ప్రమాదముంది. దీంతో నిరుద్యోగుల నుంచి మరింత ఆందోళన వ్యక్తమవుతుందా? అయినా ఉద్యోగుల ప్రయోజనాలు, ఆర్థిక అవసరాల దృష్ట్యా వయో పరిమితి పొడిగించాలా? అని సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. దశల వారీగా రిక్రూట్‌మెంట్లను కొనసాగించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలని యోచిస్తోంది. రిటైర్మెంట్‌ వయసు పెంపుపై మూడు నెలల కిందటే ఆర్థిక శాఖ సీఎంకు ఫైలు పంపిందని, దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

అధ్యాపకులకు 62 ఏళ్లు!
యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆరా తీయటంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం యూనివర్సిటీ అధ్యాపకులకు 60 ఏళ్ల వయో పరిమితి ఉంది. తమ సర్వీసును 62 ఏళ్ల వయో పరిమితికి పెంచాలని కొంతకాలంగా అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. దీంతో యూనివర్సిటీ అధ్యాపకులకు 62 ఏళ్ల వరకు పరిమితిని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సంబంధిత ప్రతిపాదనల ఫైలుతో పాటు విజ్ఞప్తులను పంపించాలని ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు