ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ!

21 Oct, 2016 02:14 IST|Sakshi
ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ!

మండలి భవనం కూడా అక్కడే  
15 ఎకరాల్లో నిర్మాణానికి ప్రభుత్వం యోచన
చారిత్రక ప్యాలస్, జలసౌధ భవనాలు తొలగించి నిర్మాణం
సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన రోడ్లు, భవనాల శాఖ
వచ్చేనెలలో కొత్త క్యాంపు ఆఫీస్‌లోకి సీఎం
అదే సమయంలో అసెంబ్లీ, మండలికి కొత్త భవనాలపై ప్రణాళికలు ఖరారు


సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలికి కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఖైరతాబాద్-పంజాగుట్ట దారిలో ఉన్న చారిత్రక ‘ఎర్రమంజిల్ ప్యాలస్’ ప్రాంగణంలో వీటిని నిర్మించాలని తాత్కాలికంగా నిర్ణయించింది. ప్యాలస్ భవనాన్ని, దాని దిగువన కొనసాగుతున్న నీటిపారుదల శాఖ కార్యాలయం(జలసౌధ) భవన సముదాయాలను కూల్చి ఆ స్థలంలో అసెంబ్లీ, మండలి భవనాలు నిర్మించాలని యోచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో రోడ్లు, భవనాల శాఖ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నాంపల్లిలోని శాసనసభ, శాసనమండలి భవనాలు పాతబడటంతోపాటు ఆ ప్రాంగణం ఇరుగ్గా ఉండటంతో కొత్త భవనాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త సచివాలయం, చట్ట సభలు, పరేడ్ మైదానం, విభాగాధిపతుల కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉండాలని సీఎం తొలుత భావించారు.

ఇందుకు ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి, మానసిక చికిత్సాలయం ఉన్న ప్రాంగణాలను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుత సచివాలయం ఉన్నచోటనే భవనాలను కూల్చి కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తాజాగా నిర్ణయించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చట్టసభలకు విడిగా మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎర్రమంజిల్ భవన ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం దృష్టికి రావటంతో సీఎం వెంటనే ప్రతిపాదనలు పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయ భవనం సిద్ధమవుతోంది. వచ్చేనెలలో కేసీఆర్ అందులోకి మారనున్నారు. ఆ వెంటనే ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి కొత్త భవనాల నిర్మాణం ప్రారంభించనున్నారు. అదే సమయంలో శాసనసభ, శాసన మండలికి కూడా కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు సమాచారం.
 
15 ఎకరాల విస్తీర్ణంలో..

ఎర్రమంజిల్ భవనంలో ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఇటీవలే దాని వెనకే తెలంగాణ రోడ్లు భవనాల శాఖకు కొత్తగా ఆధునిక భవన సముదాయం నిర్మించి అందులోకి కార్యాలయాన్ని మార్చారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ కార్యాలయం మాత్రం పాత భవనంలోనే కొనసాగుతోంది. త్వరలో దాన్ని పూర్తిగా ఏపీ రాజధానికి తరలించి భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఇక దాని దిగువన నీటిపారుదల శాఖకు చెందిన జలసౌధ భవనం ఉంది. దాని ముందు రోడ్లు, భవనాల శాఖకు చెందిన మరో పాత భవనం ఉంది. ఇప్పుడు ఈ అన్ని భవనాలను కూల్చి మొత్తం స్థలంలో ఆధునిక హంగులతో అసెంబ్లీ, మండలిని నిర్మించాలనేది ఆలోచన. ఈ మొత్తం స్థలం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానితో పోలిస్తే ఇక్కడ విశాలమైన భవనంతోపాటు పార్కింగ్, సెక్యూరిటీ తదితరాలకు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.
 
వారసత్వ కట్టడమే కానీ..
నగరంలో అలనాటి ప్యాలెస్‌లు ఎన్నో చారిత్రక వారసత్వ కట్టడాలుగా భాసిల్లుతున్నాయి. ఎర్రమంజిల్ ప్యాలెస్ కూడా ఆ కోవలోనిదే. అయితే ప్రస్తుత అవసరాలకు కొత్త భవనాల నిర్మాణానికి ఈ వారసత్వ హోదా కొంత అడ్డంకిగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలను అలాగే పరిరక్షిస్తూ... ఇతర భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న పాత భవనాలను ఇతర అవసరాలకు వీలుగా వాడుకోవాలని భావిస్తోంది. ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను వారసత్వ  జాబితా నుంచి తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.
 
ఖర్చు విషయంలో ఆచితూచి!
భవనాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుండటంతో సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సచివాలయం కోసం తొలుత ఢిల్లీలోని నార్త్‌బ్లాక్, సౌత్ బ్లాక్ తరహాలో మూడు భవన సముదాయాలుగా నిర్మించాలని భావించారు. ఇందుకు 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. కానీ ఇటీవల దాన్ని 5 లక్షల చదరపు అడుగులకే పరిమితం చేయాలని, ఒకే బ్లాకుగా నిర్మించాలని సూచించారు. దీంతో అంచనా వ్యయం రూ.350 కోట్ల నుంచి రూ.180 కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో చట్టసభలకు కొత్త భవనాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.

ఆ ప్యాలెస్ వయసు 146 ఏళ్లు
ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను 1870లో నిర్మించారు. నాటి నిజాం నవాబులు రాయల్ డిన్నర్‌లు, ఇతర వినోదాల కోసం దీన్ని విడిదిగా వాడేవారు. సంబరాలకు, కుటుంబపరమైన కార్యక్రమాలకు, ముఖ్య అతిథులు వచ్చినప్పుడు విందుల కోసం వినియోగించేవారు. ఇండో-యురోపియన్ నమూనాలో దీన్ని అత్యంత ఠీవీగా నిర్మించారు. ఇందుకు విదేశాల నుంచి నాణ్యమైన కలపను తెప్పించారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం తర్వాత ఇది రాష్ట్రప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. అప్పట్లో దీన్ని రికార్డు స్టోర్స్‌గా వాడారు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటుకు కేటాయించారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉంది. ఇక శాసనసభ పాత భవనాన్ని 1905లో టౌన్‌హాల్ కోసం నాటి నిజాం ప్రభుత్వం నిర్మించింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభగా వాడుతూ వచ్చింది. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. అందుకు 1980లో ప్రణాళిక సిద్ధం చేసి 1985లో భవనాన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు