అలరించిన తెలంగాణ రోబో

5 Apr, 2016 04:37 IST|Sakshi
అలరించిన తెలంగాణ రోబో

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తయారైన తొలి రోబో సోమవారం ఐటీ పాలసీ ఆవిష్కరణ వేదికపై అలరించింది. ‘టీ-వన్’గా పేరుపెట్టిన ఈ రోబో ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వేదికపై ఒక చివర నుంచి ముఖ్య అతిథి సీటు వరకు వెళ్లి... ఐటీ పాలసీ పత్రాలను అందించే పనిని దీనికి అప్పగించారు. ఈ రోబో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి పత్రాలను అందించడం అందరినీ అలరించింది. కార్యక్రమం ముగిశాక వేదికపై ఉన్న ప్రముఖులు ఈ రోబో తో ఫొటోలకు ఫోజులి వ్వడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీకి చెందిన బృందం ఈ రోబోను తయారు చేసింది. ఆ బృందాన్ని సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు.
 
ఎల్‌ఈడీ మెరుపులతో ప్రారంభం
 అధికారికంగా నిర్వహించే ఉత్సవాలు, వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఐటీ పాలసీని ఆవిష్కరించే వేడుక సరికొత్తగా ప్రారంభమైంది. ఎల్‌ఈడీ బల్బుల మిరుమిట్ల మధ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జ్యోతి ప్రజ్వలనకు బదులుగా తెలంగాణ, అందులో పది జిల్లాల నైసర్గిక స్వరూపం కనబడేలా 130 ఎల్‌ఈడీ బల్బులతో రూపొందించిన చిత్రపటాన్ని ఆన్ చేశారు. ఈ ఎల్‌ఈడీ బల్బులన్నీ తెలంగాణలో తయారైనవి కావటం విశేషం. రెజల్యూట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వీటిని రాష్ట్రంలో మొదటిసారిగా తయారు చేసింది. కంపెనీ అధినేత రమిందర్‌సింగ్‌ను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.

>
మరిన్ని వార్తలు