ఇక్కడ ఢిల్లీ నేతల పెత్తనమేంటి?

10 Jul, 2017 01:58 IST|Sakshi
ఏఐసీసీ నేతలపై టీ కాంగ్రెస్‌ సీనియర్ల అసంతృప్తి
- కష్టం మాదైతే.. క్రెడిట్‌ వారిదా?
తామే కష్టపడుతున్నట్లు అధిష్టానానికి నివేదికలిస్తున్నారని మండిపాటు
 
సాక్షి, హైదరాబాద్‌: పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో ఏఐసీసీ నేతల పెత్తనంపై కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీలోని చిన్నచిన్న కార్యక్రమాల నుంచి నియామకాల దాకా ఏఐసీసీ నేతల కనుసన్నల్లోనే నడిపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించిన నేతలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో రాష్ట్రేతర నేతలైన ఏఐసీసీ బాధ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తెలంగాణలో పార్టీని అంతా తామే భుజాల మీద మోస్తున్నట్టుగా అధిష్టానవర్గానికి నివేదికలను ఇచ్చుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యనేతలున్నారు. పార్టీకి క్షేత్రస్థాయిదాకా మూలాలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికీ అన్నివర్గాల్లో సానుకూల వాతావరణం ఉంది. వీటితో పాటు అధికారం కోల్పోయిన బాధ పార్టీ రాష్ట్ర ముఖ్యులందరిలోనూ ఉంది. అలాగే పార్టీ శ్రేణుల్లోనూ పెద్దగా విబేధాలేమీ లేవు. రాష్ట్ర నాయకత్వం కూడా ఉత్సాహంగా, చాలా వరకు సమన్వయంతో వ్యవహరిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఏఐసీసీ నేతలే రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, పార్టీ పదవుల పంపకం దాకా అన్నీ వారే చూడటం నా లాంటి సీనియర్లకు ఇబ్బందికరంగా ఉంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ముఖ్య నాయకుడొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
పక్క రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయొచ్చుగా..
తెలంగాణలో కాంగ్రెస్‌కు బలముందని, పటిష్టమైన కేడర్‌ ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఈ వాస్తవాన్ని మరిచిపోయి పార్టీని అన్ని స్థాయిల్లో తామే బలోపేతం చేస్తున్నామనే సంకేతాలను అధిష్టానవర్గానికి ఇస్తున్నారని మండిపడుతున్నారు.‘ఇప్పటికే బలంగా ఉన్న తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం పెద్ద విషయం కాదు. ఇటీవల నిర్వహించిన రిజర్వుడు నియోజకవర్గాల ముఖ్యుల సమావేశాన్ని ఏఐసీసీ నేత ఒకరు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ కార్యక్రమంకోసం రాష్ట్రపార్టీ ముఖ్యులు, సీనియర్లు చేసిం దేమీ లేదన్నట్లుగా ఢిల్లీకి నివేదికలు వెళ్లాయి.

కేవలం ఒక ఏఐసీసీ నేత వల్లనే ఈ శిబిరం జరిగినట్టుగా అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు’ అని జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర వహించిన నాయకుడు అభిప్రాయపడ్డారు. ‘ఒకవేళ ఆ ఏఐసీసీ నాయకుడే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అనుకుంటే మంచిదే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చాలా బలహీనంగా ఉంది కదా. ఆ నాయకుడు ఏపీలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిం చలేదు. ఆ రాష్ట్రంలోనూ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అక్కడ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు నిర్వహించడంలేదు. కేవలం తెలంగాణ ఒక్కటే ఆ నేతలకు దొరికిందా? మేం కష్ఠపడితే, ఆ ఘనత వారి ఖాతాలో పడాలా?  దీర్ఘకాలిక వ్యూహాల్లేకుండా, కేవలం చిన్నచిన్న కార్యక్రమాలతో తెలంగాణలో పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు’అని ఆ నాయకుడు దుయ్యబట్టారు.  
మరిన్ని వార్తలు