కాన్పుకు పోతే.. కడుపు కోతే!

16 Mar, 2017 03:14 IST|Sakshi
కాన్పుకు పోతే.. కడుపు కోతే!

- ప్రైవేటు ఆసుపత్రుల్లో 75% సిజేరియన్లతో తెలంగాణ టాప్‌
- రాష్ట్రంలో 81 శాతంతో తొలిస్థానంలో కరీంనగర్‌
- సామాజిక ఆర్థిక సర్వే–2017లో వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 74.9 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు చేస్తూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 70.9 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లతో పశ్చిమబెంగాల్‌ రెండో స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 40.6 శాతమే సిజేరియన్‌ ద్వారా జరుగుతున్నా యని తాజాగా విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే–2017 వెల్లడిం చింది.  రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి జరిగే కాన్పుల్లో సరాసరి 58 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, అదికూడా అన్ని రాష్ట్రాల కన్నా అధికమని తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లో జరిగే కాన్పుల్లో 63 శాతం, గ్రామాల్లో జరిగే కాన్పుల్లో 53 శాతం సిజేరి యన్‌ ద్వారానే జరుగుతున్నాయి. పాత జిల్లాల ప్రకారం.. కరీంనగ ర్‌లో అత్యధికంగా 81.1 శాతం కాన్పులు సిజేరియన్‌ ద్వారా జరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగా రెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ సిజే రియన్‌ ఆపరేషన్లు అధికంగా జరుగు తున్న జిల్లాలుగా నిలిచాయి. రాష్ట్రం లో 91.5 శాతం కాన్పులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగు తున్నాయి. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం 70.8 శాతమే ఆసు పత్రుల్లో జరుగుతున్నాయి. దీంతో తల్లుల మరణాల రేటు అక్కడ 152గా ఉంది. అనవసర సిజేరియన్లపై ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయాన్ని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు