పోరాటాలకు సిద్ధం కావాలి

24 Jun, 2016 03:04 IST|Sakshi
పోరాటాలకు సిద్ధం కావాలి

చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల్ని అన్ని విషయాల్లోనూ చైతన్యవంతుల్ని చేయాలన్నారు. గురువారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగించారు. అమరవీరుల త్యాగం ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆగం చేస్తోందని, బంగారు తెలంగాణ కోసం ఆశపడితే అది కనుచూపు మేరలో సాధ్యమయ్యేలా కన్పించటంలేదని చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ తన ఐదేళ్ల 100 రోజుల పాలనలో ఏనాడూ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారని, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి.. వారికి అండగా నిలిచి, చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ కమిటీలను ఈ నెల 28లోగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును ప్రజలకు వివరించి, వారిని చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, మతీన్, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, రఘురామిరెడ్డి(మీసాల్ రెడ్డి) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు