‘ఇఫ్తార్‌’ ఖర్చు వివరాలు చెప్పండి

15 Jun, 2017 02:30 IST|Sakshi
‘ఇఫ్తార్‌’ ఖర్చు వివరాలు చెప్పండి
మైనారిటీ సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు ఖర్చుల వివరాలు తమ ముందుంచాలని బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు పేరుతో వక్ఫ్‌బోర్డ్‌ నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ, ఇఫ్తార్‌ విందుకు 2015, 2016, 2017ల్లో జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది రజా సమీర్‌ అహ్మద్‌ వాదనలు వినిపిస్తూ ఇఫ్తార్‌ విందు ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఎక్కడా బయటపెట్టడం లేదని పేర్కొన్నారు.

జీవోల్లో ఆ వివరాలను ప్రస్తావించట్లేదని తెలిపా రు. మైనారిటీలకు ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇందులో మైనా రిటీయేతరులూ పాల్గొంటున్నారని వివరించారు. సీఎం కూడా ఈ విందులో పాల్గొంటున్నారని తెలిపారు. ధర్మాసనం జీవోను పరిశీలించి, ఇందులో 420 మసీదుల్లో 500 మందికి చొప్పున విందు ఇవ్వాలని ఉందని, మరి మైనారిటీయేతరులు విందులో పాల్గొన్నారని ఎలా గుర్తించాలని ప్రశ్నించింది. ప్రభుత్వాలు అనేక పథకాలకు రాయితీలు ఇస్తుంటాయని, ప్రతీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.

మైనారిటీ నిధులను అవసరమైన మైనా రిటీల కోసం వినియోగించడాన్ని తాము వ్యతిరేకించట్లేదని సమీర్‌ తెలిపారు. ఇఫ్తార్‌ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోంది కాబట్టే జోక్యం కోరుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇఫ్తార్‌ విందు జీవో అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇఫ్తార్‌ విందుకు అయ్యే వ్యయాలకు సంబంధించిన వివరాలు తమ ముందుంచాలని మైనారిటీ సంక్షేమ శాఖ తరఫు న్యాయవాదికి స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది 
మరిన్ని వార్తలు