చ..చ.. చలి

11 Jan, 2015 00:37 IST|Sakshi
చ..చ.. చలి

రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
కనిష్టం 10 డిగ్రీలుగా నమోదు
నేడు 7 నుంచి 8 డిగ్రీలకు పడిపోయే అవకాశం

 
సిటీబ్యూరో: గ్రేటర్‌పై చలి పులి మళ్లీ పంజా విసురుతోంది. నగర వాసులను తీవ్రంగా వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా ఓ మోస్తరుగా ఉన్న కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం ఒక్కసారిగా 10 డిగ్రీలకు పడిపోయాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యల్పం. శనివారం తెల్లవారు జామున కనిష్టంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... గరిష్టంగా 29 డిగ్రీలు నమోదైంది. నగర వాసులు చలికి గజగజ  వణికిపోయారు. ఉదయం 8 గంటలు దాటినా ఇల్లు వదిలి బయటకు రాలేని  పరిస్థితి తలెత్తింది. ఇక సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలయ్యాయి. రాత్రి పూట ఇళ్లకు వెళ్లే వాహనదారులు, సిటీ బస్సులు, ఆటోల్లో వెళ్లే ప్రయాణికులు చలి గాలులను తట్టుకోలేకపోతున్నారు. రెండో శనివారం, సంక్రాంతి సెలవులు కలసివచ్చినా పార్కులు, హోటళ్లు, ఇతర సందర్శన స్థలాల్లో పెద్దగా సందడి కనిపించలేదు. గత నెల చివరి వారంలో కనిష్టంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. తిరిగి శనివారం మరోసారి పడిపోయాయి.

 నేడు మరింత కనిష్టం... ఇలా ఉండగా... ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదే తరహాలో 2010లో 8.3, 8.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి ప్రభావానికి గురి కాకుండా నగర వాసులు జాగ్రత్తలు పాటించాలని, వాహనదారులు వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు చిన్నారులు, పెద్దలు, వయోధికులు చలి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, వెచ్చని దుస్తులు ధరించాలని చెబుతున్నారు
 

మరిన్ని వార్తలు