రాములోరి భూములు.. రాబందులపాలు!

10 Jan, 2018 01:53 IST|Sakshi

దేవరయాంజాల్‌ శ్రీరామచంద్రస్వామి ఆలయ భూములు పరాధీనం

హైదరాబాద్‌ శివార్లలో విలువైన 1,531 ఎకరాలు

సాక్షి, హైదరాబాద్‌ :  అది హైదరాబాద్‌ శివారు దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం... నిజాం హయాంలో ఆ ఆలయానికి దాతలు ఇచ్చిన భూమి 1,531 ఎకరాలు.. భూముల నుంచి వచ్చే ఆదాయంతో దేవాలయం వర్ధిల్లాలనే ఆలోచనతో జరిగిన ఏర్పాటు అది.. ఇప్పుడు ఆలయం అలాగే ఉంది.. కానీ ఆ భూముల నుంచి నయా పైసా ఆదాయం రావటం లేదు.. అలాగని భూములు ఖాళీగా లేవు.. పదుల సంఖ్యలో పరిశ్రమలు, ఫంక్షన్‌ హాళ్లు, రిసార్టులు, ఇళ్లు, దుకాణాలు ఉన్నాయి.

అందులోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్‌ ఉంది. 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది, ఎవరి జేబుల్లోకి వెళుతోంది, అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి?... వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు.

ఇప్పుడు ఆ భూములను శాశ్వతంగా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లోకాయుక్తలో నమోదైన కేసు, దానికి సమాధానంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌తో ఈ భూముల బాగోతం కళ్లకు కడుతోంది.

సీతారామస్వామి.. సీతారామరెడ్డి అయ్యాడు!
దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి మందిరం చాలా పురాతన ఆలయం. నిజాం పాలనా హయాంలోనే ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని ఇనామ్‌గా ఇచ్చారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు.

ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డిగా, సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారాములుగా.. రకరకాల పేర్లతో మారిపోయి చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకెక్కాయి.

ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. అనధికార సమాచారం ప్రకారం వాటి నుంచి ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దెలు, లీజుల పేరుతో వసూలవుతున్నట్లు అంచనా.

కబ్జాదారులకే భూములు!
ఈ భూములను ‘కబ్జా’లో ఉన్న వారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ దీనిపై ఏర్పడ్డ జస్టిస్‌ వెంకటరామిరెడ్డి కమిషన్‌ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. దేవాలయ మేనేజర్‌ చంద్రమోహన్, సహాయ కమిషనర్‌ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్‌ జ్యోతిలపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది.

విజిలెన్స్, ఏసీబీలు కూడా విచారణ జరిపి ఈ ముగ్గురితోపాటు నాటి దేవాదాయ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యదర్శిగా ఉన్న జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్‌ రామకృష్ణకుమార్, ఉప కమిషనర్‌ మోహనాచారిలను కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ వీరిలో ఎవరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

చివరికి వారికి క్లీన్‌చిట్‌ ఇవ్వటమేకాకుండా పదవీ విరమణ చేసిన వారు పోగా మిగతావారికి పదోన్నతులు కూడా కల్పించేశారు. తాజాగా ఆలయ భూముల వ్యవహారంపై లోకాయుక్తలో కేసు దాఖలైంది. దీనిపై దేవాదాయ శాఖ వివరణ ఇస్తూ.. ఈ వ్యవహారాన్ని గతంలోనే దేవాదాయ శాఖ, ప్రభుత్వం పరిశీలించి ఉన్నందున.. ఈ కేసునుకొట్టివేయాలని కోరడం గమనార్హం.


ప్రతి నెలా రూ. 5 కోట్లకుపైనే
ప్రస్తుతం ఈ ఆలయ భూములను తమ అధీనంలో ఉంచుకున్నవారి నుంచి ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ఈ బృందం పనిచేస్తోందని.. ఆ సొమ్మును నేతలు, అధికారులు పంచుకుంటున్నారని చెబుతున్నారు. ఇక ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు లేని భూములు దాదాపు 800 ఎకరాల వరకు ఉన్నాయి. వీటిని తిరిగి దేవాలయం అధీనంలోకి తెచ్చి.. వాటి నుంచి ఆదాయం పొందే వీలున్నా దేవాదాయ శాఖ అందుకు సిద్ధపడకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తానికే ఎసరు పెట్టే యత్నం
అధికారులపై చర్యల సంగతేమోగానీ ఆ భూమి మొత్తాన్నీ కాజేసేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా దేవాలయ భూములను అమ్మేందుకు వీలు లేదు. 1924–25 రికార్డుల ప్రకారం అవి స్పష్టంగా దేవుడి భూములే. అంటే చట్టపరంగా ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అవకాశముంది. అయినా నేతల జోక్యం, అవినీతి అధికారుల కారణంగా ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేవు.

దేవాదాయశాఖ చట్టం సెక్షన్‌–83 ప్రకారం ‘యూజ్‌ అండ్‌ ఆక్యుపేషన్‌ చార్జీల’వసూలుకు కేసులు దాఖలు చేయవచ్చు. దీనితో ఆ భూముల యాజమాన్య వివాదం తేలేవరకు వాటిని అనుభవిస్తున్న ‘కబ్జాదారులు’మార్కెట్‌ విలువ దామాషా మేరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఈ భూముల సంగతి తేల్చాల్సి ఉండగా.. అవినీతి కారణంగా అడుగు ముందుకు పడటం లేదు.

మరిన్ని వార్తలు