జీతంలో నుంచి 10 వేలు చేతికి

30 Nov, 2016 08:13 IST|Sakshi
జీతంలో నుంచి 10 వేలు చేతికి
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట
  • బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీసుకునే వెసులుబాటు
  • అన్ని జాతీయ, ఏజెన్సీ బ్యాంకుల్లో సదుపాయం.. అవసరమైతే బ్యాంకుల పనివేళల పొడిగింపు
  • అన్ని శాఖలకు ఆర్థిక శాఖ మెమో
  • సాక్షి, హైదరాబాద్
    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! బ్యాంకుల్లో నోట్ల కొరత ఉన్న దృష్ట్యా డిసెంబర్ 1న తమ వేతనంలో నుంచి రూ.10 వేల నగదు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక లైన్ల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు చెల్లింపులు చేసేందుకు బ్యాంకర్లు అంగీకరించారు. అవసరమైతే బ్యాంకు పని వేళలను పొడిగించి ఈ చెల్లింపులు చేస్తారు. ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌తోపాటు అన్ని జాతీయ బ్యాంకులు, ఏజెన్సీ బ్యాంకుల్లో ఈ సదుపాయం ఉంటుంది. ఒకేసారి అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించు కోవాలని సూచిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలు, హెచ్‌వోడీలకు మంగళవారం సాయంత్రం మెమో జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, డీటీవోలు, ఎస్టీవోలందరికీ ఈ సమాచారం చేరవేశారు.
     
    నవంబర్ నెల ఉద్యోగుల జీతాలకు సరిపడే నిధులను తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసింది. డిసెంబర్ ఒకటో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతుంది. పెద్ద నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో నగదు విత్‌డ్రాపై ప్రస్తుతం ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఖాతాదారులు ఏటీఎంల ద్వారా రూ. 2,500, బ్యాంకులకు వెళ్లి చెక్కు ద్వారా రూ. 10 వేలు డ్రా చేసుకునే వీలుంది. ఒక వారంలో రూ. 24 వేలు మించకుండా డ్రా చేసుకోవాలన్న ఆంక్షలున్నాయి. దీంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఖాతాదారులు గంటల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో తారీఖున తమ కనీస అవసరాలకు సరిపడే డబ్బును జీతం నుంచి తీసుకునే పరిస్థితి లేదని, జీతంలో కొంత మొత్తం నగదుగా చెల్లించాలని టీఎన్‌జీవో ప్రతినిధులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్‌బీఐతోపాటు బ్యాంకర్లతో చర్చలు జరిపి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేయించింది.

మరిన్ని వార్తలు