చీకటి రోజుకు పదేళ్లు

25 Aug, 2017 00:28 IST|Sakshi
చీకటి రోజుకు పదేళ్లు

∙ ఇంకా పరారీలోనే ప్రధాన సూత్రధారి రియాజ్‌
∙ నిందితులపై కొనసాగుతున్న విచారణ


సిటీబ్యూరో: లుంబినీపార్క్, గోకుల్‌చాట్‌ల్లో జంట పేలుళ్లు చోటు చేసుకుని శుక్రవారం నాటికి పదేళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఈ ఉగ్రవాద చర్యలో 41 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 300 మంది వరకు క్షతగాత్రులయ్యారు. వీరిలో అనేక మంది ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. అదే రోజున దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ పేలని బాంబునూ స్వాధీనం చేసుకున్నారు. ఉదంతం చోటు చేసుకున్న 14 నెలలకు ఈ ఘాతుకాని ఒడిగట్టింది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులుగా తేల్చిన ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్ర ఆక్టోపస్‌ అధికారులు ఈ ఘాతుకంపై చార్జ్‌షీట్‌ సైతం దాఖలు చేశారు. ప్రస్తుతం ట్రయల్‌ దశలో ఉన్న ఈ కేసును ఇంటెలిజెన్స్‌ ఆధీనంలోని సీఐ సెల్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ‘ట్విన్‌ బ్లాస్ట్‌’ క్రమం ఓసారి పరిశీలిస్తే...

25.8.07  
సాయంత్రం 7–7.30 గంటల మధ్య లుంబినీ పార్క్, గోకుల్‌ఛాట్‌ల్లో షేప్డ్‌ బాంబులు పేలాయి. వెంకటాద్రి థియేటర్‌ వద్ద ఉన్న ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కింద ఓ పేలని బాంబు కూడా దొరికింది.  
 
27.8.07  
ఊహా చిత్రాలు రూపొందించి దాదాపు 130 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు కుట్రలు వెలుగులోకి రావడంతో కొందరిపై ఆ కేసులు నమోదు చేశారు.  

10.1.08
హైదరాబాద్‌కు చెందిన రజీయుద్దీన్‌ నాసిర్‌ను కర్ణాటకలోని దావళగెరె పోలీసులు అరెస్టు చేశారు. అయితే జంట పేలుళ్లపై ఎలాంటి క్లూ లభించలేదు.  

6.10.08
ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో దొరికిన లీడ్స్‌పై దర్యాప్తు చేపట్టిన ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ మొత్తం ఇండియన్‌ ముజాహిదీన్‌ గుట్టు విప్పింది. 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసు కొలిక్కి వచ్చింది.   

30.11.08
ఉగ్రవాదంపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌) రూపుదిద్దుకున్న ఏడాది తరవాత అధికారిక దర్యాప్తు ప్రారంభించింది.   

1.2.09
జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదుల్లో అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, అన్సార్‌ బాద్షా షేక్‌లను పీటీ వారెంట్‌ పై ముం బయి నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చారు.  

9.2.09
 దర్యాప్తులో కీలక ఘట్టమైన టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించారు. లుంబినీ పార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్‌తో పాటు ఇతనితో కలిసి హబ్సిగూడలోని బంజారా నిలయంలో బస చేసిన అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలను సాక్షులు గుర్తించారు.  

25.3.09
జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆక్టోపస్‌ అధికారులు హైదరాబాద్‌ తరలించారు. అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, అన్సార్‌ బాద్సా షేక్‌లను 2009 ఫిబ్రవరిలోనే తీసుకురాగా... ఐఎం కో–ఫౌండర్‌  సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ తర్ఖాష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి తదుపరి దర్యాప్తు జరిపారు.  

15/28.5.09, – 20.6.09
జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులనూ దర్యాప్తు చేసిన ఆక్టోపస్‌ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించి నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. వీటిలో లుంబినీపార్క్‌లో బాంబు పెట్టిన అనీఖ్, గోకుల్‌చాట్‌లో ఐస్‌క్రీమ్‌ డబ్బాపై బాంబు పెట్టిన రియాజ్‌ భత్కల్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన అక్బర్‌లతో పాటు ఇక్బాల్‌ భత్కల్, ఐఎం ఫౌండర్‌ అమీర్‌ రజా ఖాన్, ఫారూఖ్‌ తర్ఖాష్, సాదిక్‌ షేక్‌లను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో రియాజ్, ఇక్బాల్, అమీర్‌ రజా ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

సీఐ సెల్‌కు  కేసు బదిలీ  
ఆక్టోపస్‌ను పూర్తి స్థాయి కమాండో ఫోర్స్‌గా మార్చిన తర్వాత ఈ కేసుల్ని ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్‌కు బదిలీ చేశారు. ఈ వి«భాగం పర్యవేక్షిస్తున్న ఏకైక కేసు ఇదే కావడం గమనార్హం. ఐఎం ఉగ్రవాదులపై దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉండటంతో ఆయా అధికారులు తీసుకువెళ్ళడం, తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణకు సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు