-

నెత్తుటి చరితకు పదేళ్లు

18 May, 2017 01:12 IST|Sakshi
నెత్తుటి చరితకు పదేళ్లు

మక్కా మసీదు వద్ద భద్రత కట్టుదిట్టం
ర్యాలీలకు అనుమతి లేదంటున్న పోలీసులు


చార్మినార్‌: మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి గురువారం నాటికి పదేళ్లు (2007)పూర్తవుతున్నాయి.ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా 20మంది గాయపడ్డారు.  దీంతో దక్షిణ మండల పోలీసులు నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.  నగర అదనపు పోలీసు కమిషనర్‌ (క్రైమ్‌) స్వాతి లక్రా ఆధ్వర్యంలో  ఐదుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది ఇన్‌స్పెక్టర్లు,  100 మందికి పైగా ఎస్‌ఐలు, రెండు కంపేనీల ఆర్‌ఏఎఫ్, 20 ప్లటూన్ల టీఎస్‌ఎస్‌పీ బలగాలతో పర్యవేక్షించనున్నాయని అదనపు డీసీపీ బాబురావు తెలిపారు.

నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదు
పాతబస్తీలో ఎక్కడా ఎలాంటి నిరసన సభలు,ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని దక్షిణ మండల అదనపు డీసీపీ బాబురావు తెలిపారు. కీలకమైన అన్ని ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామన్నారు. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేయడంతో పాటు సామూహిక ప్రార్థనలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2007  మే 18 పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి మైనార్టీ సంక్షేమ శాఖ నిధులను మంజూరయ్యాయి. త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు