ఇందిరా పార్క్‌ వద్ద ఉద్రిక్తత

15 May, 2017 12:12 IST|Sakshi
ఇందిరా పార్క్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ :  ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌ సోమవారం పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నా చౌక్‌ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో హోరెత్తింది. ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్‌ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పర్మిషన్‌ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం టీ. జేఏసీ నేతలు, వామపక్షాల నేతలతో పాటు స్థానికులు కూడా ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు దిగారు.

 ధర్నాచౌక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్‌కు గాయాలయ్యాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్‌ రణరంగాన్ని తలపిస్తోంది.

కాగా ఇరు వర్గాలు సంయమనం పాటించి తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వడంలేదని... అయితే ఈ ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు