టెన్‌షన్ వద్దు

19 Mar, 2016 01:12 IST|Sakshi
టెన్‌షన్ వద్దు

సిటీబ్యూరో: టెన్త్ క్లాస్‌పరీక్షలు వచ్చేశాయి.. ఈనెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి.. ఇప్పటికే  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. పరీక్షలు వస్తున్నాయనే ఆందోళన చెందకండని నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. పరీక్షలకు మొత్తం 1.78 లక్షల మంది రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 791 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రె గ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు వేర్వేరు సెంటర్లు కేటాయించారు. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరగుతాయి. ద్వితీయ భాష పరీక్ష మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆయా స్కూళ్లకు పంపించారు. ఫీజు విషయంలో స్కూల్ యాజ మాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే.. హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌల్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విద్యాశాఖ కల్పించింది. డౌల్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై సదరు స్కూల్ ప్రధానోపాధ్యాయులు లేదంటే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షకు హాజరుకావాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్ తెలిపారు. ఈ హాల్‌టికెట్లతో వచ్చే విద్యార్థులను పరీక్ష రాసేందుకు తప్పక అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 21, రంగారెడ్డి జిల్లాలో 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించనున్నారు.  పరీక్ష నిర్వహణ, కేంద్రాల చిరునామా తదితర విషయాలపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాన్ని హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  ఉదయం 8 గంటల నుంచే ఇవి పనిచేస్తాయి.

 

ఇబ్బందులు తలెత్తకుండా...
వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీటికి కొరత లేకుండా చూస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు తాగునీటికి ఇబ్బందులు లేకపోవచ్చు. పరీక్షలు ముగిసేంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్‌ను అందుబాటులో ఉంచుతారు. అలాగే కేంద్రాల్లో ప్రథమ చికిత్స పెట్టెలతోపాటు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. డీ హైడ్రేషన్, వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడే చికిత్స అందిస్తారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జంట జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

ఎర్రమంజిల్‌లో సీసీ కెమెరాలు
నగరంలోని ఉన్నత పాఠశాలల్లో నిఘా నీడన పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాకో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఒక పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎర్రమంజిల్ పాఠశాలలో మొత్తం 10 కెమెరాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో 8, ప్రధానోపాధ్యాయుని చాంబర్ , బడి ఆవరణలో ఒకటి చొప్పున బిగించారు.

 

మెరుగైన ఫలితాలు సాధిస్తాం..
పదో తరగతి పరీక్షలంటేనే కొంత ఆందోళన సహజమని, దాన్ని దూరం చేసేలా విద్యార్థులను సన్నద్ధం చేశామని డీఈఓలు పేర్కొన్నారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా, పాఠ్యాంశాలను అర్థం చేసుకుని చక్కగా సమాధానాలు రాసేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు. గతంలా కాకుండా.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.

 

ఇలా చేయండి
పరీక్షకు ముందు రోజు సెంటర్‌ను ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది.  పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. కనీసం ఉదయం 8.45 గంటలలోపు ఉండాలి  సెల్‌ఫోన్లు, క్యాలిక్‌లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.  హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహారం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. జ్యూస్‌లు తీసుకుంటే నీరసం రాదు.

 

 ఒకవేళ హాల్‌టికెట్ పోగొట్టుకున్నా, ఫీజలు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www.bsetelangana.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షలకు హాజరుకావచ్చు.

 

మరిన్ని వార్తలు