పిల్లోడి పెద్ద మనసు

25 Apr, 2018 01:12 IST|Sakshi

సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50 వేల విరాళం ఇచ్చిన టెన్త్‌ విద్యార్థి విశ్రుత్‌

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ విద్యార్థి దగ్గర రూ.50 వేలు ఉంటే ఏం చేస్తాడు? ఒక మంచి ఫోన్‌ కొంటాడు.. లేదా ఈ వేసవిలో టూర్‌ వెళ్లి ఎంజాయ్‌ చేస్తాడు. కానీ విశ్రుత్‌ అనే విద్యార్థి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి విరాళం ఇచ్చి పది మంది మెచ్చుకునేలా చేశాడు.

‘‘గత 46 నెలల్లో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా లక్షా 20 వేల కుటుంబాలు లబ్ధిపొందాయి. సుమారు రూ.800 కోట్లను ఖర్చు చేశాం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి అవసరాలు తీరుస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్లు ‘చీఫ్‌ మినిస్టర్స్‌ రిలీఫ్‌ ఫండ్, తెలంగాణ స్టేట్‌’పేరు మీద చెక్కులను పంపండి’’ అని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఇటీవల ట్వీట్‌ చేశారు. ఈ విజ్ఞప్తి విశ్రుత్‌ను కదిలించింది. ఫోన్‌ కొనుక్కునేందుకు దాచుకున్న రూ.50 వేలను సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళంగా ఇచ్చేలా చేసింది.

ఫోన్‌ తర్వాతైనా కొనుక్కుంటా: తల్లి ఇచ్చిన పాకెట్‌ మనీని జాగ్రత్తగా దాచుకున్న విశ్రుత్, అలా జమ చేసుకున్న రూ.50 వేలతో మంచి ఫోన్‌ కొనుక్కోవాలనుకున్నాడు. అయితే కొన్ని లక్షల కుటుంబాలకు ఆసరాగా ఉన్న సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సహాయం చేయడానికి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

‘రామ్‌(కేటీఆర్‌) అంకుల్‌ ప్రజలకు చేస్తున్న సహాయం చూశాక ఫోన్‌ తర్వాతైనా కొనుక్కోవచ్చనుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుల్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ఏ ఒక్కరైనా ఆ డబ్బులతో చికిత్స పొందుతా రని భావిస్తున్నా’నని విశ్రుత్‌ అన్నాడు. ఈ సందర్భంగా విశ్రుత్‌ను కేటీఆర్‌ అభినందించారు. విశ్రుత్‌ చేసిన పని మరికొందరికి ప్రేరణలా నిలుస్తుందని, సీఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు