టెట్ వాయిదా

1 Mar, 2016 07:33 IST|Sakshi
టెట్ వాయిదా

♦ ‘పరీక్ష’పై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్ణయం
♦ మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ

 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 9న నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్ సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా టెట్ పరీక్షల కోసం అవలంబిస్తున్న నిబంధనల విశ్లేషణ, పరీక్ష నిర్వహణ విధానం, ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయుల ఎంపికలో ప్రమాణాలు పాటించేందుకు సీబీఎస్‌ఈతో సహా అన్ని రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే ఏడు సార్లు టెట్ నిర్వహించాయని, అయితే ఈ పరీక్షల్లో పలు సమస్యలు ఉత్పన్నమైనట్లు కేంద్రం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మానవ వనరుల శాఖ ఆదేశించిందని, కమిటీ నివేదిక అనంతరం రూపొందించే నూతన నిబంధనల మేరకు టెట్ నిర్వహణపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ
 టెట్ వాయిదాపడడంతో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే డీఎస్సీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం ఉంది. ఆ నివేదిక వచ్చాక టెట్ నిర్వహించే అవకాశం ఉంది. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ పరీక్షలు జరిగే అవకాశం లేకపోవడంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల నియామకం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు