విద్యుదుత్పత్తిలో టీజెన్‌కో రికార్డు

18 Nov, 2014 01:30 IST|Sakshi

79.21 శాతం పీఎల్‌ఎఫ్ నమోదు
దేశంలోనే రెండో స్థానం
ఏపీజెన్‌కోకు మూడో స్థానం
నంబర్ వన్ స్థానంలో ఒడిశా

 
సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ జెన్‌కో రికార్డు నెలకొల్పింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్ల సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ సగటున 79.21 శాతం విద్యుత్తు ఉత్పత్తి జరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్ధారించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి ప్రగతి నివేదికలను అథారిటీ విడుదల చేసింది. ప్లాంట్ల వారీగా ప్రతి నెలా విద్యుత్తు ఉత్పత్తి  గణాంకాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది.

దీని ప్రకారం... ఒడిశా రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయి. అత్యధికంగా 81.71 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో ఒడిశా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశంలో సగటున ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 64.82 శాతంగా నమోదైంది. తెలంగాణ జెన్‌కో అంతకంటే 14.39 శాతం ఎక్కువ పీఎల్‌ఎఫ్ శాతం నమోదు చేయడం విశేషం. తెలంగాణ జెన్‌కో అధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల మొత్తం సామర్థ్యం  2082.5 మెగావాట్లు. కాగా, 76.90 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఏపీ జెన్‌కో మూడో స్థానంలో ఉంది.

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు.. వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు సీఈఏ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల అధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించి భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 94.35 శాతంగా నమోదైంది.

ప్రైవేటు, ప్రభుత్వరంగంలోని విద్యుత్తు ప్లాంట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేటీపీపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడిందని, అందుకే రికార్డు స్థాయిలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించగలిగామని టీఎస్‌జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు