ఎవరినీ బెదిరించలేదు: తలసాని

27 Apr, 2016 16:21 IST|Sakshi
ఎవరినీ బెదిరించలేదు: తలసాని

సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు సాయికిరణ్ ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, బెదిరించలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. సాయిపై కిడ్నాప్ కేసు నేపథ్యంలో గురువారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామకోటేశ్వరరావు తదితరులతో కలసి 2011 ఓ నిర్మాణ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో సొమ్మును తాము రామకోటేశ్వరరావుకు ఇచ్చామన్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాల్సిందిగా రామకోటేశ్వరరావు నుంచి ప్రతిపాదన వచ్చిందని..

అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదన్నారు. బుధవారం రామకోటేశ్వరరావు, అతని మిత్రుడు కృష్ణ, మరో భాగస్వామి రామకృష్ణ, తన కుమారుడు సాయి కిరణ్ తాజ్ కృష్ణ లాబీల్లో కూర్చుని ఈ విషయమై మరోసారి చర్చించుకున్నారని తెలిపారు. కొంత డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన రామకోటేశ్వరరావు, మిగతా మొత్తాన్ని నాలుగైదు నెలల్లో ఇస్తానని ప్రతిపాదించాడన్నారు. ఈ మేరకు హామీ ఇస్తూ వైట్‌పేపర్ మీద తానే రాసిచ్చాక సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు ముగించుకుని, అక్కడి నుంచి బయలు దేరారన్నారు. ఆ తర్వాత తన కుమారుడు బెదిరించాడని రామకోటేశ్వరరావు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనిపై పూర్తి వివరాలను శుక్రవారం మరోసారి మీడియాకు వెల్లడిస్తానని మంత్రి చెప్పారు.

>
మరిన్ని వార్తలు