పాలన అద్భుతమని అసెంబ్లీలో తీర్మానించాలి

22 Oct, 2016 02:23 IST|Sakshi
పాలన అద్భుతమని అసెంబ్లీలో తీర్మానించాలి

అలా చేస్తే పాదయాత్ర ఆపేస్తాం
సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
సామాజిక న్యాయం అమలుపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి డిమాండ్

 సాక్షి, హైదరాబాద్/మంచాల: రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అద్భుతంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే తమ పాదయాత్ర వెంటనే ఆపేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లేవని, అందుకే సామాజిక న్యాయం అమలు తీరుపై చర్చించేందుకు 5 రోజుల పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేశారు.

సామాజిక న్యాయం-రాష్ర్ట సమగ్రాభివృద్ధిపై ఈ నెల 17న సీపీఎం ప్రారంభించిన 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో 100 కి.మీ. దాటింది. సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా ప్రజ లకు తమ్మినేని పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు కావట్లేదని, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం మొదలు కాకపోవడంతో కేసీఆర్‌పై , సర్కారుపై ప్రజలు మండిపడుతున్నారన్నారు.

దళితులకు మూడెకరాల భూమి కాదు కదా.. చనిపోతే మూడు గజాల స్థలం కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆయా వర్గాల ప్రజలు ఇస్తున్న మద్దతు తమను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు గ్రామాల్లో అంతిమసంస్కారాలు చేసేందుకు కనీసం శ్మశానాలు కూడా కరువయ్యాయని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. కాగా, సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. పీసీసీ నేత ఎం.కోదండరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు