రోడ్ల తవ్వకాలపై నిషేధం

3 Jul, 2016 03:27 IST|Sakshi
రోడ్ల తవ్వకాలపై నిషేధం

- ఆర్నెల్ల వరకు తవ్వకాలకు బ్రేక్
- ప్రైవేటుతో పాటు ప్రభుత్వ సంస్థలకూ వర్తింపు
- ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని నగరంలో ఆర్నెల్లపాటు ఏ అవసరం కోసమైనా సరే రోడ్ల తవ్వకాలకు అనుమతించేది లేదని జీహెచ్‌ఎంసీతోపాటు ఆయా ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్నెల్ల వరకు రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించింది. ఇప్పటికే తవ్వకాలు జరిగి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పనుల్ని వేగిరం పూర్తిచేయాల్సిందిగా ఆయా విభాగాలను ఆదేశించింది. రోడ్ల విస్తరణ తదితర కారణాల వల్ల రోడ్లపై పడి ఉన్న విద్యుత్‌స్తంభాలు, వైర్లను వెంటనే తొలగించాల్సిందిగా విద్యుత్ శాఖను ఈ సమావేశం కోరింది.

ఆయా విభాగాలు తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించి, వాటికి సంబంధించి చేసిన వ్యయాన్ని సంబంధిత శాఖలకు పంపాలని నిర్ణయించింది. శనివారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో జరిగిన సమన్వయ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, టీఎస్‌ఎస్ సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ నవీన్‌చంద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం వివరాలను జనార్దన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పనులు పూర్తయిన మెట్రో కారిడార్లలో ఫుట్‌పాత్‌లు, మీడియన్లను వెంటనే పునరుద్ధరించాలని నిర్ణయించారు.

 విధిగా బోర్డుల ప్రదర్శన
 మౌలిక సదుపాయాల కోసం చేపట్టే తాగునీరు, డ్రైనేజీ పైప్‌లైన్ల నిర్మాణం, రోడ్ల తవ్వకాలు, మరమ్మతులు తదితర ఏ పనులు చేసినా నిర్మాణం జరుగుతున్న పనులు.. ఎప్పుడు ప్రారంభించేది.. ఎప్పుడు పూర్తయ్యేది.. కాంట్రాక్టు సంస్థ ఏది.. తదితర వివరాలను సూచించే బోర్డులు విధిగా ఏర్పాటు చేయాలని కూడా సమన్వయ సమావేశం నిర్ణయించింది. పనులు చేపట్టేందుకు ముందుగానే ఆ సమాచారం ప్రజలకు తెలపాలని నిర్ణయించారు.
 
 ప్రభుత్వస్థలాల్లో పార్కింగ్ కాంప్లెక్స్‌లు
 వీలైనన్ని మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించాలని సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి.. ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, ఐటీ విభాగాల ద్వారా టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు. నగరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం ద్వారా నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల జాబితాను వెంటనే అందజేయాల్సిందిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు.  ఈ నెల 11న జరిగే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రేటర్‌లోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని జనార్దన్‌రెడ్డి కోరారు.
 
 శివార్లలో 2,700 కి.మీ. మేర పైప్‌లైన్ల ఏర్పాటు
  జీహెచ్‌ఎంసీ శివారు ప్రాంతాల్లో రానున్న రెండేళ్లలో 2వేల కోట్ల రూపాయల హడ్కో నిధులతో మెరుగైన మంచినీటి సరఫరా పనులు జరగనున్నాయి. ఈ నిధులతో దాదాపు 2,700 కి.మీ.ల మేర పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు ముందుగానే వివిధ శాఖలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందిగా జలమండలిని కోరామన్నారు. మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయ్యాక, అన్ని విభాగాలకు సంబంధించిన వివిధ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు కలగవని చెప్పారు. తద్వారా రోడ్డు వేయడం.. పైప్‌లైన్ కోసం తిరిగి తవ్వడం.. మళ్లీ రోడ్డు వేయడం వంటి సమస్యల్ని అధిగమించవచ్చునన్నారు.

మరిన్ని వార్తలు