డబ్బు కొట్టు..పోస్టు పట్టు

27 Jan, 2014 00:45 IST|Sakshi
డబ్బు కొట్టు..పోస్టు పట్టు
  •     ఓయూలో అనర్హులకు అధ్యాపక పోస్టులు
  •      భర్తీపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  •      ఇంకా తేలని మరో11 పోస్టుల భవితవ్యం
  •      అంతా పారదర్శకమేనంటున్న వీసీ
  •  
    సాక్షి,సిటీబ్యూరో/ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్: మీరు డబ్బు పెట్టగలరా..?, అర్హతల్లేవా..? ఎంచక్కా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు కొట్టేయవచ్చు. దేశంలో పేరుప్రఖ్యాతలున్న ఈ యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు అమ్ముకున్నారు. ఇటీవల చేపట్టిన అధ్యాపక పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిభావంతులను విస్మరించి, పరిశోధనల్లో కనీస అనుభవంలేని అభ్యర్థులకు పోస్టులు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీసీ సహా కొంతమంది డీన్లు, విభాగాల అధిపతులు, డెరైక్టర్లు కుమ్మక్కై పోస్టులను అమ్ముకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

    నిబంధనలకు విరుద్ధంగా తెలుగు మెథడాలజీ సబ్జెక్టుకు నాన్‌మెథడాలజీ అభ్యర్థిని ఎంపికచేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజనీతిశాస్త్రంలో ఎంఏ, పీహెచ్‌డీ, నెట్ పూర్తిచేసి, ఏడు పరిశోధన పత్రాలు ఒక పుస్తకాన్ని రాయడంతోపాటు బోధనలో 17 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న వాళ్లను పక్కనపెట్టి, ఎలాంటి అనుభవం లేని వాళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం. హిందీ అధ్యాపకుల్లో ఎంపికైన ముగ్గురు అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి నెట్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
     
    ఆది నుంచి వివాదాలే..: ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి 2008లో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2009 ఫిబ్రవరిలో మొదటిసారి నోటిఫికేషన్ విడుదల కాగా..6300మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే యూజీసీ నిబంధనలు, ఇతర కారణాల వల్ల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. ఇవే పోస్టులకు అప్పటి వీసీ తిరుపతిరావు హయంలో 2010, 2011లో రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. తీరా ఆయన పదవీకాలం ముగియడంతో ఆతర్వాత వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొ.ఎస్.సత్యనారాయణ నోటిఫికేషన్‌లో పలు సవరణలు తీసుకొచ్చి మరోసారి నోటిఫికేషన్ జారీచేశారు.

    ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ సమక్షంలో ఆయా విభాగాల వారీగా 2012 జూన్ నుంచి 2013 జూన్ వరకు సుమారు 5500 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తీరా ఫలితాలు ప్రకటించే సమయంలో పాలకమండలి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు అభ్యర్థులు, విద్యార్థుల నుంచి తీవ్ర ‘ఒత్తిళ్లు’ రావడంతో 182 పోస్టులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 11 పోస్టుల  ఫలితాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఇదిలావుంటే మరో మూడుపోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో వాటి భర్తీని తాత్కాలికంగా నిలిపేశారు.
     
    ఎంతో పారదర్శకంగా వ్యవహరించాం..
    నోటిఫికేషన్ వెలువడి, చాలాకాలంపాటు భర్తీకి నోచుకోకుండాపోయిన అధ్యాపక పోస్టులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా భర్తీ చేశాం. పరీక్షలో సాధించిన మార్కులు, వారికున్న అర్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఆయా విభాగాల నిపుణుల సమక్షంలో ప్రతిభ ఆధారంగానే పోస్టులను భర్తీచేశాం. అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఎంపికలో ఎలాంటి అవినీతి,అక్రమాలు చోటుచేసుకోలేదు.      
     - ప్రొ.సత్యనారాయణ, ఓయూ వీసీ
     

మరిన్ని వార్తలు