హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్
హైదరాబాద్: మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా భారతదేశంతోపాటు ప్రపంచదేశాలన్నీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ అన్నారు. ఈ అంశంపై శనివారం ఇక్కడ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్(టీఐపీ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది అక్రమ రవాణా కు గురవుతున్నారని, 15.50 బిలియన్ డాలర్ల వ్యా పారం జరుగుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారని చెప్పారు. మనదేశంలో ఏటా 40 వేలమంది చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. అక్రమ రవాణాకు గురైనవారిలో కొం దరిని వేశ్యవృత్తిలోకి, మరి కొందరు కట్టుబానిసలుగా, ఇంకొందరి అవయవాలను అమ్ముకునే విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ రవాణా నుంచి బయటపడినవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. సామాజిక , ఆర్థిక సమస్యల పర్యవసానంగానే మహిళలు వేశ్యవృత్తిలోకి వెళుతున్నారని, వారిని చెడుప్రవర్తన కలిగినవ్యక్తులుగా చూడకుం డా సాయం అందించేవిధంగా న్యాయవ్యవస్థ కూడా తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలన్నారు. బాధితులను ఆదుకునేందుకు న్యాయ, స్త్రీ, శిశు సం క్షేమం, పోలీసు శాఖల సమన్వయంతో ప్రవేశపెట్టిన ‘నల్సా-2015 పథకం’ పోస్టర్‌ను జస్టిస్ రామసుబ్రమణియన్ ఆవిష్కరించారు. ప్రభుత్వ శాఖ లు సమన్వయంగా పనిచేస్తే బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయమందుతుందని సీఐడీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు.