ఆశ.. నిరాశల మధ్య..!

12 Jan, 2016 01:16 IST|Sakshi
ఆశ.. నిరాశల మధ్య..!

♦ చేదు అనుభవంతో అమెరికా నుంచి తిరిగొస్తున్న విద్యార్థులు
♦ వందకు చేరిన సంఖ్య
♦ అయినా కొందరు అమెరికాబాట
 
 శంషాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి చేదు అనుభవంతో తిరిగివస్తున్న తెలుగు విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల నిరాకరణతో ఓ వైపు విద్యార్థులు తిరుగుముఖం పడుతున్నా.. కొందరు విద్యార్థులు చిన్న ఆశతో అక్కడి దాకా వెళ్లి ఆవేదనను మూటగట్టుకుని తిరుగుప్రయాణం అవుతున్నారు. డిసెంబర్ 19న శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి 14 మంది తెలుగు విద్యార్థులను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపడంతో ఈ విష యం వెలుగుచూసింది. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా అధికారులు అదేరోజున శం షాబాద్ విమానాశ్రయం నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరడానికి వచ్చిన 19 మంది విద్యార్థులను నిలిపేశారు.

ఆ విద్యార్థులు బయలుదేరుతున్న వర్సిటీలు నిషేధిత జాబి తాలో ఉన్న కారణంగా అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను తిప్పి పంపుతున్నారని వెల్లడించారు. సంబంధిత వర్సిటీలు మాత్రం అలాంటి సమస్య లేదని వర్సిటీల వెబ్‌సైట్‌లు, ఇతర మాధ్యమాల ద్వారా వెల్లడించడంతో ఇక్కడి నుంచి బయలుదేరుతున్న విద్యార్థుల సంఖ్య యథాతథంగా కొనసాగుతోంది. ఎయిరిండియా కాకుండా ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థల నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థులకు ఇక్కడి నుంచి బయలుదేరే సమయంలో ఎలాంటి అడ్డంకులూ లేకపోవడంతో వాటిలో బుక్ చేసుకున్న విద్యార్థులు అమెరికా దాకా వెళ్లి చిక్కుల్లో పడుతున్నారు.

ఇప్పటి వరకు సుమారు వందమందికి పైగా విద్యార్థులు అమెరికాలోని విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్నారు. న్యూయార్క్ వరకు వెళ్లిన 18 మంది విద్యార్థులను డిసెంబరు 22న అక్కడి నుంచి తిప్పిపంపడంతో కనెక్టివిటీ విమానం ద్వారా ముందు గా అబుదాబి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో కూడా వీరు నానా ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద డిసెంబర్ 26వ తేదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీరు తమ బాధలను ఇక్కడి వారికి తెలియజేశారు. డిసెంబర్ 27న ఇక్కడి నుంచి బయలుదేరిన 18 మంది విద్యార్థులు జనవరి 2వ తేదీన తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

అమెరికా అధికారులు తీవ్రంగా అవమానించారని ఆవేదన వెళ్లగక్కారు. న్యూయార్స్ ఎయిర్‌పోర్టులో బేడీలు వేసి తిప్పారని పలువురు విద్యార్థులు మీడియాతో వెల్లడించారు. వీసాలు కొంటున్నారా? అంటూ ప్రశ్నల వ ర్షం కురిపించారంటూ ఆవేదన చెందారు. అన్ని సమాధానాలు సరిగ్గా తెలిపినా అక్కడి అధికారులు అనుమతించడం లేదని వాపోయారు. అదేరోజు మరో 10 మంది విద్యార్థులు కూడా కాలిఫోర్నియా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. జనవరి 4వ తేదీ రాత్రి కూడా మరో 10 మంది విద్యార్థులు న్యూయార్క్ వరకు వెళ్లి ఇబ్బందులు పడి హైదరాబాద్‌కు వచ్చేశారు. తాజాగా శనివారం అర్ధరాత్రి 22 మంది విద్యార్థులు అమెరికా నుంచి ముందుగా ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

 మరో ఆరుగురు..
 ఆదివారం అర్ధరాత్రి న్యూయార్క్ నుంచి తిరుగుముఖం పట్టిన ఆరుగురు తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా  నిరాకరించారు. అమెరికా అధికారులు నానా తిప్పలు పెట్టారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు