-

ఇక రాయలసీమ ఎడారే!

21 Aug, 2016 01:22 IST|Sakshi

టీబీ బోర్డు నిర్ణయంతో ముప్పు

 సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర జలాల్ని పట్టపగలే కర్ణాటక చౌర్యం చేస్తుంటే ఇన్నాళ్లూ నోరుమెదపని తుంగభద్ర(టీబీ) బోర్డు తాజాగా దానికి ఆమోదముద్ర వేసింది. కర్ణాటక పరిధిలో లోలెవల్ కెనాల్(ఎల్లెల్సీ)పై 118.2 కి.మీ.ల వద్ద అదనంగా మరో డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటుకు శనివారం జరిగిన టీబీ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. తద్వారా కర్నూలు జిల్లా కోటాలోని రెండు టీఎంసీలను కర్ణాటక వినియోగించుకునే అవకాశముంది. దీని ఫలితంగా కర్నూలు జిల్లాలో 1,57,062 ఎకరాల ఆయకట్టు ఎడారికానున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 

అదేసమయంలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 1,90,035 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే హైలెవల్ కెనాల్(హెచ్చెల్సీ) ఆధునీకరణకు కర్ణాటక మోకాలడ్డినా నోరుమెదపలేదు. టీబీ బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈఎన్‌సీలు శనివారం హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది 151 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్న బోర్డు.. కర్ణాటకకు 102, ఏపీకి 45, తెలంగాణకు 4 టీఎంసీలను గతనెలలో కేటాయించింది. కానీ వర్షాభావ పరిస్థితులవల్ల నీటిలభ్యత తగ్గడంతో ఆ మేరకు కేటాయింపుల్లో కోతలు వేయాలని నిర్ణయించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీకి సెప్టెంబర్ 15 వరకు నీటిని విడుదల చేస్తామంది.

మరిన్ని వార్తలు