డిగ్రీ విద్యార్థులపై ‘అదనపు’ మోత!

31 May, 2016 00:32 IST|Sakshi
డిగ్రీ విద్యార్థులపై ‘అదనపు’ మోత!

- రూ.10 వేల చొప్పున వసూలు చేసుకునేందుకు ఓయూ అనుమతి
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 428 డిగ్రీ కాలేజీల్లో పెంపు
ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి రాని ‘అదనపు’ ఫీజు
దాదాపు లక్షన్నర మంది విద్యార్థులపై భారం
 
 సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ‘అదనపు’ ఫీజు మోత మోగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని డిగ్రీ కాలేజీలు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు వసూలు చేసుకునేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ‘ఆర్డినెన్స్-37’ను జారీ చేసింది. దీంతో ఓయూ పరిధిలోని దాదాపు 428 డిగ్రీ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా రూ.10 వేల చొప్పున వసూలు చేయనున్నాయి. ఈ ‘అదనపు ఫీజు’ రీయింబర్స్‌మెంట్ పథకం పరిధిలోకి రాదు. విద్యార్థులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది.

 ఆన్‌లైన్ ప్రవేశాలతో..
 ఆన్‌లైన్ ప్రవేశాలను తాము అమలు చేయబోమని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుకు తాము ఒప్పుకోబోమని ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రముఖ, అటానమస్ డిగ్రీ కాలేజీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోని కాలేజీల్లో ఫీజుల విషయంలో యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఓయూ పరిధిలోని డిగ్రీ కాలేజీలతో ఉన్నత విద్యా శాఖ చర్చించింది. కాలేజీలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 వేలు అదనంగా (అదర్ ఫీ పేరుతో) వసూలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులకు అదనంగా ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని సూచించింది. ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి వస్తాయని... ‘అదర్ ఫీ’ పేరుతో వసూలు చేసే ఈ మొత్తం రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. దీనికి అంగీకరించే కాలేజీలు ‘అదర్ ఫీజు’ను వసూలు చేసుకోవచ్చని, ఒప్పుకోని కాలేజీలు వసూలు చేయడానికి వీల్లేదని ఉస్మానియా వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
 
 భారీగా పెరుగుతున్న ఫీజులు
 ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 వరకు ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా.. వాటిల్లో దాదాపు 4 లక్షల మంది వరకు చదువుతున్నారు. అందులో ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే 428 కాలేజీలున్నాయి. వీటిలో హైదరాబాద్ మినహా రంగారెడ్డి, మెదక్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 కాలేజీల్లో ల క్షన్నర మంది వరకు విద్యార్థులు చదవుతున్నారు. ఈ కాలేజీల్లో ప్రస్తుతం కోర్సును బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వార్షిక ఫీజు అమల్లో ఉంది. ప్రస్తుతం అమల్లోకి వచ్చే ‘అదర్ ఫీజు’ కారణంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేలు అదనపు భారం పడనుంది.

మరిన్ని వార్తలు