భారం ప్రభుత్వమే భరించాలి

7 Apr, 2016 02:18 IST|Sakshi
భారం ప్రభుత్వమే భరించాలి

విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజా సంఘాల డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు భగ్గుమన్నారు. చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బుధవారమిక్కడ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఆధ్వర్యంలో సర్‌చార్జీ, అదనపు సర్‌చార్జీ ధరలు తదితర అంశాలపై బహిరంగ విచారణ జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి రా త్రి 9.30 గంటల వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి సమక్షంలో వివిధ సంఘాల నేతలు, నిపుణులు తమ వాదనలను వినిపించారు.

 ఎన్నికల తర్వాత పెంపు ప్రతిపాదనలా?
 ఉప ఎన్నికలు, హైదరాబాద్, ఇతర కార్పొరేషన్లలో ఎన్నికలు ముగిశాకే చార్జీలను వడ్డించే ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్‌కు చెందిన వేణుగోపాలరావు పేర్కొన్నారు. గృహోపయోగ కనెక్షన్లకు 200 యూనిట్లు దాటితే 20 శాతం, 400 యూనిట్లు దాటితే 35 శాతం చార్జీల పెంపుదల భారం అన్ని వర్గాల ప్రజలపై వేయడం సరికాదన్నారు. సమగ్ర ఆదాయ, అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)లో పేర్కొన్న మిగులు విద్యుత్ కనిపించడం లేదని, ఇందుకు సంబంధించిన వివరాలేవి డిస్కం ఇవ్వలేదన్నారు. మణుగురులో సబ్‌క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాలకు కేంద్రం అవసరమైనంత మేర సహజ వాయువు, బొగ్గు సరఫరా చేయడం లేదని విమర్శించారు.

 రైతులకు పరిహారం ఇవ్వాలి
 టీపీసీసీ కిసాన్‌సెల్ నేత ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ... 2004లో వైఎస్ హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు రైతుల పాత బకాయిలను మాఫీ చేసి, వారిపై పెట్టిన కేసులు ఎత్తేసినట్లు గుర్తుచేశారు. పంట పొలాల్లో 400 కేవీ లైన్లు, టవర్లు వేస్తే రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగం పెరిగినట్లుగా డిస్కంలు చూపడం నమ్మదగినదిగా లేదని పీపుల్స్ మానిటరింగ్ గ్రూపు కన్వీనర్ తిమ్మారెడ్డి అన్నారు. జెన్‌కో ద్వారా తక్కువ ధరకు కాకుండా స్వల్ప కాలిక ఒప్పందాలతో ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వల్లే అదనపు భారం పడుతోందన్నారు.

గ్రామానికి ఒక లైన్‌మెన్‌ను నియమించాలన్నారు. కొత్త కనెక్షన్ల కోసం 75 వేల దరఖాస్తులుంటే అందుల మహబూబ్‌నగర్ జిల్లాలోనే సగం ఉన్నాయని చెప్పారు. డిస్కంలకు ప్రభుత్వం అందించే సహాయానికి సంబంధించి ముందుగానే ప్రభుత్వం అఫిడివిట్ సమర్పించేలా చూడాలని పీపుల్ మానిటరింగ్ గ్రూప్‌కు చెందిన డి.నర్సింహారెడ్డి అన్నారు. కరెంట్ బిల్లును సులభతరం చేసి, అందులో పేర్కొన్న అంశాలన్నీ అందరికీ అర్థమయ్యేలా చూడాలన్నారు. కరెంట్ వైర్లు, షాకు ఇతరత్రా కారణాలతో మృత్యువాత పడుతున్న వారిని వారిని ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక నేత ఎస్.జీవన్‌కుమార్ సూచించారు.
 
 ‘మా వాళ్లను ఏసీబీకి పట్టివ్వండి’
 విద్యుత్ శాఖలో అవినీతి గురించి అందరూ మాట్లాడుతున్నారని, దీన్ని ఉపేక్షించొద్దని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ  జి.రఘుమారెడ్డి సూచించారు. రూ.10 అవినీతి జరిగినా ఏసీబీని ఆశ్రయించాలని ఆయన సూచించారు. తాను సీఎండీగా అన్ని అంశాలపై స్పందించలేనని, కొందరి వల్ల శాఖకు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించారు. ఏసీబీని ఆశ్రయిస్తే తాను కూడా వినియోగదారులకు సహకరిస్తానని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, లైన్లు ఇలా అన్నింటి కోసం జనవరి 1 నుంచి ఒక లిస్ట్‌ను పెట్టామని, దాని ప్రకారమే అవి వస్తాయని చెప్పారు. అందువల్ల నిబంధనల ప్రకా రం దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. జాతీయ ఎక్స్‌ఛేంజ్ ద్వారా వెంట నే విద్యుత్ వస్తుందనే నమ్మకం లేకే  స్వ ల్పకాలిక విద్యుత్ ఒప్పందాలకు మొగ్గు చూపుతున్నట్లు  ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు