కేంద్రం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉంది

7 Nov, 2016 03:44 IST|Sakshi
కేంద్రం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉంది

- న్యూస్ వ్యూస్ కాకూడదు
- ఉర్దూ జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం సమావేశ మందిరంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉర్దూ జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో సిటిజన్ ఫస్ట్, మీడియా సెకండ్ అని ఆయన అభివర్ణించారు. కళలకు హద్దులుండవని, కానీ దేశానికి సరిహద్దులుంటాయని, ప్రయోజనాలకు విరుద్ధంగా మీడియా స్వేచ్ఛ ఉండకూడదన్నారు. సమాజంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా వార్తా ప్రసారాలు చేయొద్దని, పరిమితులు దాటితే నిబంధలనకు లోబడి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

న్యూస్ వ్యూస్ కాకూడదని, వార్తలను వార్తల్లాగానే ప్రసారం చేయాలి తప్ప సొంత అభిప్రాయాలను జోడించవద్దని, అవసరమైతే తమ వ్యూస్‌లకు ఎడిటోరియల్ పేజీలను ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సినిమా యాక్టర్ల మాదిరిగా తళుక్కుమని మెరిసి వెళ్లిపోతుందని, ప్రింట్ మీడియా గృహిణిలాంటిదన్నారు. ఉర్దూ మధురమైనదని, మాతృభాష ఉర్దూకు ముస్లింలు దూరంగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉర్దూ మీడియా ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటామని, ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉర్దూ జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామన్నారు. దూరదర్శన్‌లో ఉర్దూ వార్తల నిడివిని పెంచుతామని ప్రకటించారు.

 తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కీలకం: మహమూద్ అలీ
 తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టులకు హెల్త్  కార్డులు, 5 లక్షల ప్రమాదబీమా కల్పించామని ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలి పారు. డెస్క్ జర్నలిస్టులతో పాటు మండలం, జిల్లాల్లోని ప్రతీ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఐజేయూ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కమిషనర్ అబీద్ రసూల్‌ఖాన్, ఉర్దూ అకాడమీ కార్యదర్శి షుకూర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు అమర్‌నాథ్, ఐజేయూ ఎం.ఎ మాజీద్, టీఎస్‌యూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ, సభ్యులు వరకాల యాదగిరి, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు