‘మక్కా’ నిందితుడి హత్య కేసులో చార్జ్‌షీట్

20 Aug, 2014 01:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన పేలుడు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ సునీల్ జోషీ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తి చేసింది. మహారాష్ట్రలోని మాలెగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న ఠాకూర్ ప్రజ్ఞాసింగ్ సాధ్వీ సహా నలుగురిపై అభియోగాలు నమోదు చేస్తూ ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
 
2007 మే 18న చోటు చేసుకున్న ‘మక్కా’ పేలుడు కేసులో సునీల్‌జోషీ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కుట్ర మొత్తం ఇండోర్ కేంద్రంగా... ఇతని నేతృత్వంలోనే జరిగినట్లు ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ గుర్తించింది.  కేసు మిస్టరీ తేలకపోవటంతో ప్రభుత్వం 2010లో ఎన్ ఐఏను రంగంలోకి దింపింది. ప్రజ్ఞాసింగ్‌ను లైంగికంగా వేధించడంతో పాటు మాలెగావ్ పేలుళ్ల కుట్రను బహిర్గతం చేస్తాడనే అనుమానం నేపథ్యంలోనే సునీల్ హత్య జరిగినట్లు ఎన్‌ఐఏ తేల్చింది. ఈ మేరకు ప్రజ్ఞాసింగ్, మరో ముగ్గురిపై అభియోగపత్రాలు దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు