చిన్నారి పెళ్లికూతుళ్లు

23 Oct, 2016 06:43 IST|Sakshi
చిన్నారి పెళ్లికూతుళ్లు

అమ్మాయిల ముందస్తు వివాహాల్లో ఏపీ టాప్

- 15 ఏళ్లకే పెళ్లి.. 18కి తల్లి!
- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ తగ్గని బాల్య వివాహాల సంఖ్య
- నిర్ణీత వయసు వచ్చాక పెళ్లి చేసుకుంటేనే తల్లీబిడ్డకు రక్షణ
 
 సాక్షి, హైదరాబాద్ : ఓటు హక్కు 18 ఏళ్లు నిండిన తర్వాతే వస్తుంది. పెళ్లి కూడా అమ్మాయికి 18 ఏళ్లు నిండాక చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని వైద్యులు చెబుతారు. 21 ఏళ్లు నిండాక తల్లయితే బావుంటుందని కూడా వైద్యుల సూచన. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో 15 ఏళ్లకే పెళ్లయ్యే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక 18 ఏళ్లకే ఇద్దరు బిడ్డల తల్లిగా మారుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇలా తక్కువ వయసులో వివాహాలు, బిడ్డలు కనడం కారణంగా 30 ఏళ్లు కూడా నిండక ముందే వివిధ శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న యువతుల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు స్త్రీ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు.



 ఏపీలో 15.9 శాతం మందికి 15 ఏళ్లకే పెళ్లి
 రాష్ట్రంలో ఏటా 5 లక్షల వరకు పెళ్లిళ్లు జరుగుతుంటాయని ఆస్పత్రులకు ప్రసవానికి వచ్చే గర్భిణుల సంఖ్యను బట్టి అంచనా. ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులు, ప్రసవాల గణాంకాలతో పాటు, జిల్లా స్థాయి హౌస్ హోల్డ్ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ లెక్కను బట్టి రాష్ట్రంలో 15.9 శాతం మంది బాలికలు 18 ఏళ్లు నిండక ముందే వివాహం చేసుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది 18 ఏళ్లు నిండక మునుపే తొలి బిడ్డకు, 20 శాతం మంది రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్లు ప్రసవాలను బట్టి తెలుస్తోంది. ఇదే పురుషుల్లో 21 ఏళ్లు నిండక మునుపే పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య 14.7 శాతం ఉంది.

 రెండో స్థానంలో తెలంగాణ
 తెలంగాణలో సైతం ఇదే పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఎర్లీ మ్యారేజెస్‌లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటే.. తెలంగాణలో మాత్రం 21 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకుంటున్న యువకుల సంఖ్య 11.8 శాతం ఉంది. ముందస్తు వివాహాల్లో అమ్మాయిల కంటే 1.1 శాతం అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు.
 
 చిన్న వయసులో తల్లి కావడం ప్రమాదకరం
 చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల రీ ప్రొడక్టివ్ (బిడ్డలను కనడం)కు కావల్సిన సామర్థ్యం అమ్మాయిల్లో ఉండదు. చిన్న వయసు, ఎదుగుదల లేని కారణంగా కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చే మార్గం తగినంత పెద్దదిగా ఉండ దు. దీనివల్ల సిజేరియన్ ద్వారా బిడ్డను తీయాల్సి రావడం, ఆ తర్వాత రకరకాల శారీరక సమస్యలు వస్తాయి. చిన్న వయసులో గర్భిణి కావడం వల్ల కాన్పు సమయంలో ఎక్కువ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుం ది. ఒక్కోసారి కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం చాలా ఉంది. 
- డా.బబిత మాటూరి,స్త్రీల వైద్య నిపుణురాలు, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు