నగరంలో డేగ కంటి నిఘా ఏర్పాటు కానుంది

11 Jul, 2013 04:14 IST|Sakshi
నగరంలో డేగ కంటి నిఘా ఏర్పాటు కానుంది
 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో డేగ కంటి నిఘా ఏర్పాటు కానుంది. ఉగ్రవాదులు, నిందితులు మొదలుకొని ఆందోళనకారుల వరకు.. వారి కదలికలను గుర్తించి, నియంత్రించేందుకు మూడో ‘కన్ను’ తెరుచుకోనుంది. కీలక ప్రాంతాల్లో క్షణ క్షణం ఏం జరుగుతుందో కళ్ల ముందు చూపే.. ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (సీసీసీ) త్వరలోనే ఏర్పాటు కానుంది. ఎంతో ఉత్కంఠ రేపిన ‘అసెంబ్లీ ముట్టడి’ని సమర్థవంతంగా  కట్టడం చేయడంలో పోలీస్ వ్యూహాలతో పాటు సీసీ కెమెరాలూ కీలక పాత్ర పోషించాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ కమిషనరేట్‌లో సీసీసీ ఏర్పాటుకు నిర్ణయించారు. గణేష్ ఉత్సవాల్లోపు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు సవాల్‌గా మారింది. నగర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఆందోళనకారుల కదలికలు ఎప్పటికప్పుడు తెలిస్తేనే వాటిని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి, నిలువరించడానికి, అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సీసీసీ కీలక భూమిక పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు. నేర నియంత్రణ, నిందితుల కదలికలు గుర్తించడానికీ ఇది ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు.
 
 ఆ అనుభవంతోనే నిర్ణయం..
 
 తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు గత నెల 14న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలోనే కమిషనరేట్‌లో తాత్కాలికంగా ఓ కంట్రోల్ సెంటర్‌ను నెలకొల్పాయి. నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా కమిషనరేట్‌లోని సర్వైలెన్స్ కెమెరా సెంటర్‌లో కనిపిస్తున్న దృశ్యాలను అధ్యయనం చేసే ఈ సెంటర్ సిబ్బంది ఉద్యమకారుల కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించారు. ఆ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులకు అందించడం ద్వారా వారిని కట్టడి చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సెంటర్ ఒకటి శాశ్వతంగా ఉంటే మంచిదనే భావన కలిగింది. అందులోంచి పుట్టిందే సీసీసీ ఆలోచన. ఇందులో పని చేయబోయే సిబ్బందికి సీసీ కెమెరా ఫీడ్ పరిశీలనకు సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇప్పించాలని కమిషనర్ నిర్ణయించారు.
 
 ‘ట్రాఫిక్’ పరిజ్ఞానం సహాయంతో..
 
 కమిషనరేట్‌లోని ఐదో అంతస్తులో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కాన్ఫరెన్స్ హాల్‌ను దీనికి కేటాయించి, ఆ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో కొత్త కాన్ఫరెన్స్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక వనరులు, పరిజ్ఞానాన్ని ఈ సెంటర్‌కూ వాడనున్నారు. హెచ్-ట్రిమ్స్ ప్రాజెక్టులో భాగంగా ట్రాఫిక్ సర్వైలెన్స్ కెమెరా సెంటర్‌లో వీడియో వాల్స్ ఏర్పాటు కానున్నాయి. దీంతో అక్కడున్న భారీ ఎల్‌సీడీ టీవీలను ఈ సెంటర్‌కు కేటాయిస్తారు. నగర వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ కెమెరాలనే దీనికీ అనుసంధానించి పర్యవేక్షించనున్నారు. అవసరాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా అద్దె సీసీ కెమెరాలు పెడతారు.
 
 ‘సేఫ్ సిటీ’ అమలైతే..
 
 కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల ద్వారా అమలులోకి రానున్న సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌తో ఈ సీసీసీకి మరిన్ని అదనపు హంగులు చేకూరనున్నాయి. ఇప్పుడున్నట్లు కేవలం జంక్షన్లు, కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా ప్రతి ప్రాంతం పైనా పటిష్ట నిఘా ఉంచడం కోసం జంట నగరాల్లో దాదాపు 5 వేల సీసీ కెమెరాల ఏర్పాటు ఈ ప్రాజెక్టులోని కీలకాంశం. సిటీ వైడ్ సర్వైలెన్స్ సిస్టం, ఐపీ బేస్డ్, ఇఫ్రారెడ్ కెమెరాలు, పాన్ టిల్ట్ జూన్ (పీటీజెడ్) పరిజ్ఞానం, త్రీడీ మ్యాపింగ్, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), ఫేషియల్ ఐడెంటిఫేషన్ సాఫ్ట్‌వేర్ తదితరాలన్నీ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి కూడా అందుబాటులోకి వస్తే సీసీసీ మరింత శక్తిమంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
 
మరిన్ని వార్తలు