కృష్ణా బోర్డు అతిపై ప్రధానికి ఫిర్యాదు!

30 May, 2016 02:45 IST|Sakshi
కృష్ణా బోర్డు అతిపై ప్రధానికి ఫిర్యాదు!

రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
- ఇప్పటికే ఓసారి ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
- మళ్లీ మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
- పార్టీ ఎంపీలకు బాధ్యత అప్పగింత
- బ్రజేశ్ కేటాయింపులు పూర్తయ్యేదాకా నియంత్రణ అక్కర్లేదని వివరణ!
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్న తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులన్నింటినీ తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కృష్ణా బోర్డు చేస్తున్న కసరత్తు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గుతూ ఆ రాష్ట్రానికి వంతపాడుతున్న బోర్డు తీరుపై ఇప్పటికే ఓసారి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసి బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా తాత్కాలికంగా నిలుపుదల చేయించిన సీఎం కేసీఆర్ మరోమారు ఇదే అంశంపై ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తమకు సమాచారం ఇవ్వకుండా, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలనే కృతనిశ్చయంతో సీఎం ఉన్నట్లు సమాచారం.

 సమాచారం ఇవ్వకుండా బోర్డు లేఖలు
 రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై తెలంగాణ అధికారుల పెత్తనమే కొనసాగుతోందని...దీనిపై బోర్డు నియంత్రణ అవసరమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ప్రస్తుతం మళ్లీ ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ఏపీ తెరపైకి తెచ్చింది. వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వీలుగా ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో ప్రాజెక్టుల నిర్వహణ మ్యాన్యువల్‌ను బోర్డు రూపొందించింది. మ్యాన్యువల్ ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రానున్నాయి.

హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లూ బోర్డు నియంత్రణలో ఉంటాయి. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలు, రూపొందించిన నిబంధనల మేరకు నీటి వినియోగం ఉండేలా దీన్ని రూపొందించింది. ఉమ్మడి ప్రాజెక్టులు, మెజరింగ్ పాయింట్ల వద్ద సీఐఎస్‌ఎఫ్ పహారా ఉండాలని, అందుకు అయ్యే ఖర్చులో ఇరు రాష్ట్రాలు చెరి సగం భరించాలని అంటోంది. అయితే కేంద్రానికి బోర్డు మ్యాన్యువల్ పంపే వరకు రాష్ట్రానికి సమాచారం లేదు. బోర్డు సమావేశం నాటికే తాము లేఖలు రాశామని, ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకుంటామంటూ చెప్పడం రాష్ట్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
 
 తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్రం...

 ఉమ్మడి ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసి ప్రాజెక్టులవారీ నీటి లెక్కలు తేలాక బోర్డు వాటి నిర్వహణను మాత్రమే చూడా లి. అదీగాక బ్రజేశ్ ట్రిబ్యునల్ గడువును పొడగిస్తూ ప్రాజెక్టులవారీ కేటాయింపులు నిర్ధారించాలని చట్టంలో ఉంది. దీని ప్రకా రం ఎవరి వాటా ఎంత, వినియోగం ఏ రీతి న ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు అర్థవంతంగా వ్యవహరించాలి. కానీ బోర్డు మా త్రం ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకునేం దుకు తొందరపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. దీనిపై ప్రధాని, ఉమాభారతికి లేఖ రాయాలని నిర్ణయించింది. బ్రజేశ్ కేటాయింపులు పూర్తయ్యేదాకా బోర్డు నియంత్రణ అక్కర్లేదని రాష్ట్రం వివరించే అవకాశం ఉంది. వీలునుబట్టి ప్రధాని లేదా ఉమాభారతిని కలసి ఈ విషయమై విన్నవించే బాధ్యతను రాష్ట్ర ఎంపీలకు కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు