2 నెలలు ఆగి రండి!

8 Mar, 2017 05:28 IST|Sakshi
2 నెలలు ఆగి రండి!

అత్యవసర పరీక్షలపై సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ
సిటీస్కాన్, ఎంఆర్‌ఐలకూ నెలల తరబడి ఆగాల్సిందే
రిపోర్టుల కోసం మరో పక్షం రోజుల నిరీక్షణ
ఆ లోపు వ్యాధి ముదిరితే అంతే సంగతి!


వరంగల్‌లోని భారత్‌ గ్యాస్‌ కార్యాలయంలో పని చేస్తున్న భాస్కర్‌.. ఇటీవల అకస్మాత్తుగా ఎడమ కాలి స్పర్శ కోల్పోయాడు. స్థానిక ఈఎస్‌ఐ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు అత్యవసరంగా ఎంఆర్‌ఐ పరీక్ష చేయించాలని చెప్పారు. దీంతో జనవరి 30న హుటాహుటిన హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చాడు.  అత్యవసరమైనప్పటికీ ఫిబ్రవరి 21 వరకు ఎంఆర్‌ఐ తీసేందుకు వీలు లేదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. వారు చెప్పినట్లే గతనెల 21న ఎంఆర్‌ఐ పరీక్ష చేయించాడు. కాని రిపోర్టులు మాత్రం భాస్కర్‌ చేతికందలేదు. దీంతో చికిత్స చేయించుకోవాల్సిన సమయంలో ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. రిపోర్టు రానిదే చికిత్స చేయలేమని వైద్యులు తేల్చి చెప్పడంతో భయాందోళన చెందుతున్నాడు.

ఉప్పల్‌కు చెందిన ఎన్‌.మల్లారెడ్డి
వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. పక్షం రోజుల క్రితం నిలబడలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించగా అత్యవసరంగా ఎంఆర్‌ఐ తీయించమని చెప్పాడు. దీంతో ఎంఆర్‌ఐ పరీక్ష కోసం కౌంటర్‌ వద్దకు వెళితే.. మే 24వ తేదీన వచ్చి పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.వెన్నునొప్పి తీవ్రం కావడం, నడవలేని పరిస్థితి ఏర్పడడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: జబ్బు చేసి దవాఖానకు వెళ్తే.. ఖాళీ లేదు మళ్లీ రండి అంటే..? వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే.. ‘రెండు నెలల తర్వాత..’ అని తిప్పి పంపిస్తే.. ఆ రోగి పరిస్థితి ఏమిటి? హైదరాబాద్‌లోని కార్మిక ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. చికిత్స కోసం వందల కిలోమీటర్ల నుంచి వస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి నరకం చూపిస్తోంది. అత్యవసర పరీక్షలు తక్షణమే చేయాల్సిందిగా వైద్యులు సూచనలు చేస్తుండగా.. ఆస్పత్రిలో మాత్రం పరీక్షలు చేసేందుకు నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.

రెండు నెలల తర్వాత..
వ్యాధి నిర్ధారణలో ఎంఆర్‌ఐ, సిటీస్కాన్‌ పరీక్షలు కీలకం. ఈ పరీక్షల ఆధారంగా వచ్చే ఫలితాలను బట్టి రోగులకు చికిత్స మొదలుపెడతారు. ఈ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ఈ పరీక్షలు అవసరమున్న కార్మికులు అత్యాధునిక పరికరాలు ఉన్న సనత్‌నగర్‌ ఆస్పత్రిలో సంప్రదిస్తారు. కాని ఇక్కడ పరీక్షలు నిర్వహించడానకే నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. అత్యవసర కేటగిరీలో వచ్చే పేషంట్లను కూడా రెండు నెలల తర్వాత వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్పత్రి కావడంతో పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరీక్షలు చేయడానికి రెండు నెలల తర్వాత రమ్మనడంపై కార్మిక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పరీక్షల ఫలితాల సంగతీ అంతే!
సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. వాటి తాలూకు రిపోర్టులు తీసుకోవడం మరో ఎత్తు. పేషంట్లు నిర్దేశిత తేదీల్లో వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నా.. రిపోర్టులు పొందాలంటే వారం నుంచి పక్షం రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిందే. రిపోర్టులు రాకపోవడంతో చికిత్స ప్రారంభించలేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆస్పత్రిని నమ్ముకుని వచ్చిన రోగి ప్రాణాలమీదకు వస్తోంది. ఎంఆర్‌ఐ, సిటీస్కాన్‌ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉందని, గతంలో ఆరుగురు పని చేస్తుండగా ప్రస్తుతం నలుగురే ఉన్నారని, రెండు రాష్ట్రాల నుంచి పేషంట్లు అధికంగా రావడంతో జాప్యం జరుగుతోందని ఆ విభాగ అధికారి స్వర్ణలత ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు