డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో గందరగోళం!

20 Jun, 2017 01:46 IST|Sakshi

- దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాని ఓటీపీ
- 1.40 లక్షల మందికి సీట్లు కేటాయిస్తే 40 వేల మందికే కన్ఫర్మేషన్‌


సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలు గందరగోళంగా తయారయ్యాయి. సాంకేతిక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు పొందిన 1,40,067 మంది విద్యార్థుల్లో 83,249 మంది విద్యార్థులు మాత్రమే అలాట్‌మెంట్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలోనూ సగం మంది కూడా సోమవారం వరకు కాలేజీల్లో చేరలేదు. కాలేజీల్లో చేరేందుకు వెళ్లిన వారికి వన్‌టైం పాస్‌వర్డ్‌ అందకపోవడంతో కాలేజీల్లో సీటు కన్ఫర్మ్‌ చేసుకోలేకపోయామని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు కాలేజీల్లో చేరే గడువు ఈ నెల 20తో ముగియనుంది. దీంతో 43 వేల మంది విద్యార్థుల చేతుల్లో సీటు అలాట్‌మెంట్‌ లెటర్లు ఉన్నా కాలేజీల్లో సీట్లు పొందలేని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలోని 1,088 డిగ్రీ కాలేజీల్లోని 4,08,377 సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల్లో 1,40,067 మందికి ఈ నెల 15న సీట్లు కేటాయించింది. వారంతా ఈ నెల 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొంది. అయితే సీట్లు పొందిన విద్యార్థులంతా మొదటి విడతలో సీటు వచ్చిన కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడట్లేదు. 83,749 మంది విద్యార్థులే ఆయా కాలేజీల్లో చేరేందుకు అంగీకరించారు. సాంకేతిక సమస్యల కారణంగా వారంతా కాలేజీల్లో చేరే సమయంలో తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ సాయంతో ఆన్‌లైన్‌లో సీటు కన్‌ఫర్మ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఓటీపీ అందరికీ రాలేదు.  ఓటీపీ అందని విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో కాలేజీల్లో రిపోర్టు చేసే గడువును  పొడిగించాలని ప్రవేశాల కన్వీనర్‌ వెంకటాచలానికి డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు