‘లెక్క’ చెప్పలేదు

19 Mar, 2016 01:12 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖర్చుల వివరాలివ్వని అభ్యర్థులు
సమర్పించకుంటే అనర్హత వేటు పడే ప్రమాదం


సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాక ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలి. లేని పక్షంలో రాబోయే మూడేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీకి వీలుండదు. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇంకా 412 మంది తమ వివరాలను అధికారులకు సమర్పించలేదు. ఈ నెల 20 వరకు మాత్రమే దీనికి గడువుంది. ఈ మేరకు అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా లెక్కలు సమర్పించని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు లెక్కలు తెలపని వారు మూడేళ్ల వరకు పోటీ చేయడానికి అనర్హులు. ఉప ఎన్నికలొస్తే తప్ప జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేదే ఐదేళ్లకోసారి. అంటే.. మళ్లీ ఎన్నికలు జరిగే సమయానికి వీరి పోటీకి ఆటంకాలు ఉండవు. అలాంటప్పుడు అనర్హత వేటు వేసినా, వేయకపోయినా వారికి జరిగే నష్టమేమీ లేదు. ఈ ధీమాతోనే ఓడిపోయిన పలువురు అభ్యర్థులు దీనిపై దృష్టి సారించలేదని తెలుస్తోంది.

గెలిచిన వారు ఎన్నికల లెక్కలు చూపని పక్షంలో కార్పొరేటర్లుగా అనర్హులవుతారు. దీంతో వారు అప్రమత్తంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గడువు వరకు అధికారులు వేచి చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల లెక్కలు తెలపాల్సిందిగా ఓడిన వారిని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మాదిరిగా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్ల వరకు అనర్హత వేటు వేస్తేనే ఇలాంటి వారుస్పందిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై శ్రద్ధ చూపితే బాగుంటుందని వారు భావిస్తున్నారు

మరిన్ని వార్తలు