నాగసాకిపై అణుబాంబు వేసిన దేశం?

21 Jan, 2015 23:32 IST|Sakshi

‘మనమంతా ఒక్కటే’ అనే భావన జాతీయవాదానికి ఊపిరినిస్తుంది. ‘అందరి కంటే మనమే గొప్ప’ అనే ఆలోచన దురాక్రమణ పూర్వక జాతీయవాదాన్ని బలపరుస్తుంది. ఈ రెండు భావనల నుంచి పుట్టినవే సామ్యవాదం, సామ్రాజ్యవాదం. క్రీ.శ. 19వ శతాబ్దంలో యూరప్ దేశాల్లో జాతీయవాదం కారణంగా సామ్యవాదం చెలరేగి, రాజరికాన్ని ప్రశ్నించింది. దురాక్రమణ పూర్వక జాతీయవాదానికి పారిశ్రామిక విప్లవం తోడై సామ్రాజ్యవాదం కోరలు చాచింది. సామ్రాజ్యవాద దేశాలు వలసవాదంతో బలహీన దేశాలను కాటువేశాయి. ఈ పరిణామాలు వికటించి వాటిలో అవే విషం చిమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలను సమిధలుగా చేసిన వీరి విభేదాలు రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి.
 
ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం
రెండు ప్రపంచ యుద్ధాలకు కారణాలు - పరిణామాలు, ఫలితాలు; ప్రపంచ శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ఏవిధంగా తోడ్పడుతుంది? తదితర విషయాల గురించి ‘ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (1900-1950)’ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం.
 
ప్రముఖ చరిత్రకారుడైన ‘ఎరిక్ హబ్స్‌బామ్’ 20వ శతాబ్దాన్ని ‘తీవ్ర సంచలనాల యుగం’గా అభివర్ణించాడు. పారిశ్రామిక విప్లవం వల్ల ఈ శతాబ్దంలో నూతన ఆవిష్కరణలు చేశారు. దీంతో శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగింది. ఈ పరిణామం యూరప్ దేశాల్లో ఉత్తేజాన్ని నింపింది. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలపై నమ్మకం పెరిగింది. తరాలుగా వలసవాద దోపిడీలో మగ్గిన ఆఫ్రికా, ఆసియా దేశాలు స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాయి.

రాజకీయ స్వేచ్ఛ పెరిగి, ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల ఏర్పాటుకు దారులు తెరుచుకున్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక విధానానికి పునాదులు పడ్డాయి. క్రీ.శ. 1929లో ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918), రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) ప్రజ్వరిల్లాయి. ఫాసిజం (ఇటలీ), నాజీజం (జర్మనీ) జనించాయి.  1945లో ఏర్పడిన ఐక్య రాజ్య సమితి (యునెటైడ్ నేషన్‌‌స ఆర్గనైజేషన్) మరో ప్రపంచ యుద్ధం జరగకుండా శాంతి దీపాన్ని వెలిగించింది.
 
మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం:
1914 జూన్ 28న ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను సెర్బియాకు చెందిన ఉన్మాది హత్య చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆస్ట్రియా సెర్బియాపై దాడిచేసింది. ఈ రెండింటికీ మద్దతుగా కొన్ని దేశాలు కూడా యుద్ధరంగంలోకి దిగాయి. ఈ విధంగా 1914 జూలై 28న మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇది 1918 నవంబర్ వరకు కొనసాగి, పారిస్ శాంతి సదస్సు (1919)తో ముగిసింది. ఆ సదస్సులోనే వర్సెయిల్స్ సంధి షరతులు రూపుదిద్దుకున్నాయి. ఈ యుద్ధంలో మిత్ర రాజ్యాలు గెలిచాయి.
 
మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు:
 మిత్ర రాజ్యాలు: సెర్బియా, రష్యా, ఇంగ్లండ్, {ఫాన్‌‌స, జపాన్, అమెరికా.కేంద్ర రాజ్యాలు: ఆస్ట్రియా, జర్మనీ,ఇటలీ, టర్కీ.
రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం: పోలాండ్ తనకు చెందిన డాంజింగ్ ఓడరేవును జర్మనీకి ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి ఆగ్రహించిన హిట్లర్ (జర్మనీ) పోలీష్ కారిడార్‌పై దాడి చేశాడు. 1939 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ దాడి.. రెండింటికీ మద్దతిచ్చే దేశాలు కూడా ప్రవేశించడంతో ప్రపంచ యుద్ధంగా మారింది. ఈ యుద్ధం 1945 ఆగస్ట్‌లో ముగిసింది. మిత్రరాజ్యాలు మళ్లీ గెలుపొందాయి.
 

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలు:
 మిత్ర రాజ్యాలు: పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్‌‌స, రష్యా, అమెరికా, చైనా.
 కేంద్ర రాజ్యాలు: జర్మనీ, ఇటలీ, జపాన్.
మొదటి ప్రపంచ యుద్ధానికి దీర్ఘకాలిక కారణాలు: దురహంకారపూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనిక (మిలటరీ) వాదం.
రెండో ప్రపంచ యుద్ధానికి దీర్ఘకాలిక కారణాలు: వర్సెయిల్స్ సంధి షరతులను అవమానకరంగా భావించడం, మిత్ర రాజ్యాలపై పెత్తందారీతనం, నానాజాతి సమితి వైఫల్యం, రష్యా సామ్యవాదం పట్ల పెట్టుబడిదారీ దేశాల భయం.
 
కీలక పదాలు - నిర్వచనాలు
     పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం: యంత్ర సామగ్రి వినియోగాన్ని విస్తృతం చేసి వస్తువుల ఉత్పత్తి ప్రక్రియలో ఆర్థిక సమతౌల్యం సాధించడం.

మైత్రి ఒప్పందాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలోని సంస్థలు లేదా దేశాల మధ్య పరస్పర సహకారం చేసుకోవడానికి కుదిరే అంగీకార ఒప్పందాలు. వీటి లక్ష్యాలు ఒకే రకంగా ఉంటాయి. దేశాల మధ్య ఒప్పందాలు రాజకీయ పరమైనవిగా ఉంటాయి.
     

దురహంకార పూరిత జాతీయవాదం: తీవ్రమైన జాతీయభావనకు గురైన ప్రజలు వారి జాతే గొప్పదని భావిస్తూ, దాని వ్యాప్తి కోసం కృషి చేస్తూ, ఇతర జాతులు,  ప్రజల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండటాన్ని ‘దురహంకార పూరిత జాతీయవాదం’గా పేర్కొంటారు. ఇది ఒక దేశం ఇతర ప్రాంతాలను ఆక్రమించడాన్ని సమర్థిస్తుంది.
     

సైనిక వాదం: దేశ భద్రతకు దృఢమైన సైనిక శక్తి అత్యవసరమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని ప్రజలు లేదా ప్రభుత్వం విశ్వసించడాన్ని ‘సైనిక వాదం’ అంటారు.
     

ఫాసిజం: బెనిటో ముస్సోలినీ ఇటలీలో ఫాసిస్ట్ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ భావజాలన్ని ‘ఫాసిజం’ అంటారు. ఇది ‘ఫాసియో’ అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. దీనికి ‘కడ్డీల కట్ట’ అని అర్థం. ఈ భావజాలాన్ని నమ్మేవారు ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ఉదారవాదం, కమ్యూనిజాలను వ్యతిరేకిస్తారు. ప్రపంచంలో వారి జాతే గొప్పదని విశ్వసిస్తారు.
     

నాజీజం: జర్మనీలో హిట్లర్ ‘నేషనల్ సోషలిస్ట్ పార్టీ’ స్థాపించాడు. దీన్ని ‘నాజీ పార్టీ’గా పేర్కొంటారు. దీని సిద్ధాంతాలు, భావాలు ‘నాజీయిజం’గా ప్రసిద్ధి చెందాయి. హిట్లర్ రాసిన ‘మెయిన్ కాంఫ్’ గ్రంథాన్ని ‘నాజీ వేదం’గా భావించారు. నాజీయిజం నోర్డిక్ జాతి గొప్పదనాన్ని కీర్తిస్తూ, యూదు జాతీయులను వ్యతిరేకిస్తుంది.
     

సామ్రాజ్యవాదం: రాజకీయ, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికీ కొన్ని బలమైన దేశాలకు వలస రాజ్యస్థాపన అవసరమైంది. వలస రాజ్యాలను విస్తరించుకోవడానికి ఈ బలమైన రాజ్యాల మధ్య ఏర్పడిన శత్రుత్వాన్ని ‘సామ్రాజ్యవాదం’గా పేర్కొంటారు.
   

రహస్య ఒప్పందాలు: ఫ్రాంకో - ప్రష్యన్ (1870) యుద్ధం తర్వాత యూరప్‌కు చెందిన అనేక దేశాలు వాటి స్వాతంత్య్రంతో పాటు ఆర్థిక, వాణిజ్యపరమైన ప్రయోజనాలను కాపాడుకోవడానికి రహస్య ఒప్పందాలు చేసుకున్నాయి. వీటినే రహస్య కూటములు అని అంటారు. ఆ తర్వాత ఇవి సైనిక కూటములుగా అవతరించి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి.
 
 4 మార్కుల ప్రశ్న
 1.    20వ శతాబ్దం ప్రథమార్ధంలో యుద్ధాల వివిధ ప్రభావాలు ఏమిటి?    (విషయావగాహన)
 జ.    20వ శతాబ్దం ప్రథమ అర్ధ భాగంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు (1914-18, 1939 -45) ప్రపంచ రూపురేఖలను మార్చాయి. ఈ యుద్ధాలు ప్రపంచ రాజకీయాలను, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
   

అసంఖ్యాక ప్రాణనష్టం: రెండు ప్రపంచ యుద్ధాల కారణంగా అనేక మంది మరణించారు. చాలామంది గాయపడి అవిటివారయ్యారు. మరణించినవారిలో అధిక శాతం యువకులే ఉన్నారు. ఈ రెండు యుద్ధాల వల్ల అణుబాంబులు, రసాయనిక మారణాయుధాల పోటీ పెరిగింది. ప్రపంచ మనుగడకు ఇవి ముప్పుగా పరిణమించాయి.
     

ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటన: ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవశ్యకతను గుర్తించాయి. అప్రజాస్వామిక వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో రెండు ప్రపంచ యుద్ధాలు గుణపాఠాలను నేర్పాయి. వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాలు ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థవైపే మొగ్గు చూపాయి.
     

నూతన అధికార సమతౌల్యం: రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం అప్పటికే సామ్రాజ్యాలను స్థాపించి అధికారయుతంగా ప్రవర్తించిన దేశాలు, కూటములు చాలావరకు అంతమయ్యాయి. జాతీయత, ఆర్థిక మనుగడ, సైనిక భద్రతల ఆధారంగా మధ్య, తూర్పు, యూరప్ ప్రాంతాలుగా విడిపోయాయి. సామ్రాజ్యవాద దేశాలు వలసవాద తత్వాన్ని వీడి, ఆయా ప్రాంతాలకు స్వాతంత్య్రం ఇవ్వడం వల్ల ప్రపంచ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
     

కొత్త అంతర్జాతీయ సంస్థలు: ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నానా జాతి సమితి (1919), రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్య రాజ్య సమితి (1945) ఏర్పడ్డాయి.
     

మహిళలకు ఓటు హక్కు: సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ రాజకీయ హక్కుతో స్త్రీల సాధికారత పెరిగి లింగ వివక్ష తగ్గుముఖం పట్టింది. చాలాదేశాల్లోనూ మహిళా స్వేచ్ఛను గౌరవించడం ప్రారంభమైంది.
 
 2 మార్కుల ప్రశ్న
 1.    భారతదేశం - పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం ఎంతకాలం కొనసాగింది? ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు?
     (సమాచార సేకరణ నైపుణ్యం)
 జ.    బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో జోక్యం చేసుకోవడం వల్ల భారత్ - పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగింది. ఇది 1971 డిసెంబర్ 3న ప్రారంభమై, డిసెంబర్ 16న ముగిసింది. 13 రోజులపాటు కొనసాగింది. దీంట్లో సుమారు 4000 మంది భారత సైనికులు, 9 వేల మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు.
     
 1 మార్కు ప్రశ్న
 1.    ఐక్య రాజ్య సమితిపై మీ అభిప్రాయం ఏమిటి?
     (ప్రశంస/ అభినందన - సున్నితత్వం)
 జ.    ఐక్య రాజ్య సమితి (యూఎన్‌వో) అనేది ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి ఏర్పడిన అంతర్జాతీయ అత్యున్నత సంస్థ. దీంట్లో ప్రస్తుతం 193 సభ్యదేశాలున్నాయి. ఇవి యూఎన్‌వో ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నాయి.
 
 లక్ష్యాత్మక ప్రశ్నలు (అర మార్కు)
 1.    ఐక్య రాజ్య సమితి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
     1) అక్టోబర్ 24    2) నవంబర్ 25
     3) సెప్టెంబర్ 26    4) డిసెంబర్ 22
 2.    నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు వేసిన దేశం?
     1) జపాన్    2) ఇంగ్లండ్
     3) జర్మనీ    4) అమెరికా
 
 సమాధానాలు:  1) 1   2) 4 

మరిన్ని వార్తలు