పోలీసుల అదుపులో నకిలీ వెబ్‌సైట్ సృష్టికర్త

13 Jan, 2016 01:44 IST|Sakshi
పోలీసుల అదుపులో నకిలీ వెబ్‌సైట్ సృష్టికర్త

సాక్షి, హైదరాబాద్: పోలీసు కొలువులకు సంబంధించిన రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌ను సృష్టించిన వ్యక్తి నిజామాబాద్‌కు చెందిన వేదకుమార్‌గా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వేదకుమార్ కేవలం వెబ్‌సైట్ రేటింగ్స్ కోసమే ఈ పని చేసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన వెబ్‌సైట్ రూపకల్పనలో రిక్రూట్‌మెంట్ బోర్డ్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదుతో..: ఈ బాగోతం సోమవారమే వెలుగులోకి రావడంతో రిక్రూట్‌మెంట్ బోర్డు వివరణతో కూడిన పత్రికా ప్రకటన సైతం విడుదల చేసింది. దీనికి సంబంధించి నగరానికి చెందిన శ్రీహరితో పాటు మరో వ్యక్తి మంగళవారం ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందం వేదకుమార్‌ను అదుపులోకి తీసుకుంది. మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశం ఉంటే... పేమెంట్ గేట్ వే సైతం తన ఖాతాల్లోకి వచ్చేలా సృష్టించే వాడని, ఇది కేవలం వెబ్‌సైట్ రేటింగ్స్ కోసం చేసినట్లు అధికారులు చెప్తున్నారు.  నకిలీ వెబ్‌సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని అసలు వెబ్‌సైట్ తిరస్కరిస్తుండగా... అభ్యర్థులు చెల్లించిన డబ్బు వారి ఖాతాల్లోకి తిరిగి రావడమో, రిక్రూట్‌మెంట్ బోర్డు ఖాతాలో జమ కావడమో జరిగింది.

 లక్షల మంది వ్యవహారంలో నిర్లక్ష్యంగా...
 ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తీరునూ సైబర్ నిపుణులు తప్పుపడుతున్నారు. లక్షల మందికి సంబంధించిన వెబ్‌సైట్ సృష్టి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌కు తెలంగాణ 10 జిల్లాల నుంచి 2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి రిక్రూట్‌మెంట్‌కు ఈ సంఖ్య 3 లక్షలు దాటుతుందనే అంచనా ఉంది. ఒక్కొక్కరి ఫీజు సరాసరిన రూ. 300 చొప్పున చూసినా... ఇది రూ. 9 కోట్లకు సంబంధించిన అంశం. అలాంటి వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) సర్వర్‌లో కాకుండా ప్రైవేట్ డొమైన్‌లో హోస్ట్ చేయడం సబబు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్‌ఐసీ ద్వారా వచ్చిన వెబ్‌సైట్ భద్రంగా ఉండటంతో పాటు అడ్రస్ చివరలో (.జౌఠి.జీ) వస్తుందని, ప్రైవేట్ సర్వర్ అయిన కారణంగానే (.జీ) ఉందని ఓ నిపుణుడు తెలిపారు.
 
 ఒకటి నాడే సృష్టించాడు..
 తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత నెల 31న నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న వేదకుమార్ ఈ నెల ఒకటిన (శుక్రవారం) నకిలీ వెబ్‌సైట్ సృష్టించాడు. వాస్తవ వెబ్‌సైట్ (www.tslprb.in)కు సారూప్యంగా ఉండేలా (www.tslprb.com) అడ్రస్‌తో దీన్ని రూపొందించాడు. దీని చివరలో హైపర్ లింకు ఇచ్చిన నిందితుడు దాన్ని క్లిక్ చేస్తే అసలు వెబ్‌సైట్‌కు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశాడు. డాట్ ఇన్‌కు బదులుగా డాట్ కామ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన అనేక మంది దరఖాస్తుదారులు అందులోని పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లింపులూ చేశారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత నకిలీ వెబ్‌సైట్ అనే అంశం కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం కావడం ప్రారంభించింది.

మరిన్ని వార్తలు