రైలు పట్టాల పక్కన యువకుడు మృతి

30 Aug, 2016 21:02 IST|Sakshi

 వినాయక్‌నగర్ రైలు పట్టాల పక్కన అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మక్బూల్‌జానీ తెలిపిన వివరాల ప్రకారం..వినాయక్‌నగర్‌లో నివాసముండే నర్సింగ్‌యాదవ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా చిన్న కుమారుడు అంజనేయులు యాదవ్ (20) సెంట్రింగ్ పని చేస్తుండేవాడు. అంజనేయులు యాదవ్ మంగళవారం తెల్లవారుజామున రైలు ఢీకొని మృతిచెందాడు. ప్రజలు చూసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. నేరేడ్‌మెట్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ప్రమాదమా...హత్యనా?
ఇదిలా ఉండగా రైలు పట్టాలపై రక్తం మరకలు, ఒక సిరంజి, ద్విచక్ర వాహనానికి సంబందించిన తాళం చెవి లభ్యమయ్యాయి. రైలు ఢీకొని మృతి చెందితే మృతుడి అవయవాలు చెల్లచెదురు కావడం ఉంటుంది. అలా కాకుండా అంజనేయులు ఒంటిపై, ముఖంపై గాయాలతో పట్టాల పక్కన మృతదేహం పడి ఉండడంతో ఎవరో హత్య చేసి రైలు పట్టాల పక్కన పడేశారని రైలు ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు