కేసీఆర్‌.. ఓ 'తుగ్లక్‌'

7 Sep, 2017 03:00 IST|Sakshi
కేసీఆర్‌.. ఓ 'తుగ్లక్‌'

సచివాలయం తరలింపు పిచ్చి నిర్ణయం: ఉత్తమ్‌
బైసన్‌ పోలో గ్రౌండ్‌లో ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం
ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని వ్యాఖ్య
ఆ భూమిని ప్రజావసరాలకు వినియోగించాలి: జానారెడ్డి
మైదానాన్ని పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు  


సాక్షి, హైదరాబాద్‌:  కొత్త సచివాలయం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తే ఊరుకు నేది లేదని.. సచివాలయం తరలింపు ఒక పిచ్చి తుగ్లక్‌ నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌మార్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ సేవలందించిన సచివాలయం ఇప్పడు తెలంగాణకు సేవలు అందించలేదా అని నిలదీశారు. సచివాలయాన్ని తరలించేం దుకు ప్రతిపాదించిన బైసన్‌ పోలో మైదానాన్ని బుధవారం కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనను నిరసిస్తూ మైదానంలో బైఠాయించి ధర్నా చేశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌ తదితరులు నిరసన తెలిపి మీడియాతో మాట్లా డారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఉత్తమ్‌ మండిపడ్డారు. దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రజలకు సేవలు అందిం చిన సచివాలయం ఇప్పడు తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించలేదా అని నిలదీశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సచివాలయాన్ని నిరుపయోగంగా వదిలే యడం ఎందుకని ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం అమరావతికి తరలివెళ్లిన తర్వాత సచివాలయ భవనాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకో కుండా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం తగదని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలెన్నో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా.. వాటన్నింటిని పక్కనపెట్టి సచివాలయం గురించి ప్రయత్నాలు చేయడం దారుణమని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హక్కులను కూడా పట్టించుకోవడం లేదని పేర్కొ న్నారు.

ఇక బైసన్‌ పోలో మైదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే అభ్యంతరమేమీ లేదని, కానీ అందులో సచివాలయం నిర్మించాలన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని జానారెడ్డి చెప్పారు. ప్రజావసరాల కోసం ఆ భూమిని ఉపయోగించాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రాచరిక పాలన సాగుతోందని షబ్బీర్‌అలీ విమర్శించారు. ముందు దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఆస్పత్రుల్లో వసతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, యువతకు ఉద్యోగాలు వంటి హామీలు నిలబెట్టుకోవాలని సూచించారు. బైసన్‌ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణం సమర్థనీయం కాదని.. దానిని తాము వ్యతిరేకించడమే కాదు అడ్డుకుంటామని వీహెచ్‌ పేర్కొన్నారు.

పోలీసు రాజ్యంగా తెలంగాణ: భట్టి
రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయని, తెలంగాణ పోలీసు రాజ్యంగా మారిపోయిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దళితులపై దాడులు అమానుషమని వ్యాఖ్యానించారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జల కాంతం ఆధ్వర్యంలో బుధవారం, రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు, మాజీ ఎంపీ హన్మంతరావు, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందని విమర్శించారు. వీహెచ్‌ మాట్లాడుతూ.. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఎమ్మెల్యే చింతల విమర్శించారు. అనంతరం భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు నిమ్స్‌లో నేరెళ్ళ బాధితులను కలసి పరామర్శించారు.

మరిన్ని వార్తలు