చెరువులకు పరిపాలనా అనుమతుల్లో జాప్యం!

4 Feb, 2016 03:30 IST|Sakshi

నేడు సమీక్షించనున్న మంత్రి హరీశ్
 
 సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ రెండో విడత పనుల ఆరంభానికి ఆర్థికశాఖ తీరు ఆటంకంగా మారుతోంది. చెరువుల పునరుద్ధరణ పనులకు పరిపాలనా అనుమతులను సకాలంలో మంజూరు చేయడంలేదు. బుధవారం కేవలం449 చెరువులకే అనుమతులు లభించా యి. ఆర్థికశాఖ వద్ద ఇప్పటివరకు 4,500 చెరువులకుగాను 1,500కే అనుమతులొచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్థిక, చిన్న నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రెండో విడత మిషన్ కాకతీయ కింద మొత్తంగా 10,355 చెరువులను ఈ ఏడాది పునరుద్ధరించాల్సిఉంది.

వీటికోసం మొత్తంగా రూ.2,083కోట్లు ఖర్చు చేయనున్న ట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది అంచనాల తయారీ, వాటి ఆమోదం, టెండరింగ్ ప్రక్రియలో జాప్యం కారణంగా పనులు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. దీంతో జూన్ లో వర్షాలు కురిసే నాటికి కాంట్రాక్టర్లకు 3 నెలల సమయమే చిక్కడంతో 40 శాతం పనులను పూర్తి చేయగలిగారు. అయితే పెద్దసంఖ్యలో చెరువు పనుల అనుమతులను డీడీఎం స్క్రూటినీ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోందని గుర్తించిన నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయిలో చర్చించి రూ.2కోట్లకు తక్కువైన పనులను డీడీఎం ఆమోదం లేకుండానే నేరుగా ఆర్థిక శాఖకు ఫైలు వెళ్లేలా చర్యలు చేపట్టింది. దీంతో ఒక చెరువుకు ఆమోదం దక్కేందుకు 4నుంచి 5రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం రెండో విడత చెరువు పనుల ఆమోదానికి 10 నుంచి 12 రోజులు పడుతోంది. ప్రస్తుతం బడ్జెట్ తయారీ, కృష్ణా పుష్కరాల అంచనాల తయారీ, మేడారం జాతరకు నిధుల సమకూర్చడం వంటి ఇతర అంశాల్లో ఆర్థిక శాఖ అధికారులు బిజీగా ఉండటంతో అనుమతులు త్వరగా రావడం లేదు.

>
మరిన్ని వార్తలు