ఆ లోపాలే ‘క్యాష్’!

25 May, 2016 00:09 IST|Sakshi
ఆ లోపాలే ‘క్యాష్’!

చిరుద్యోగుల ఆధీనంలో రూ. కోట్ల నగదు
పక్కాగా లేని ఆడిటింగ్ స్వాహా చేస్తున్న ఉద్యోగులు
‘ఆర్సీఐ కేసు’ యాజమాన్యానికీ భాగస్వామ్యం

 

 సిటీబ్యూరో: 2012లో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సీఎంఎస్ కార్యాలయంలో రూ.2.6 కోట్లు... 2014లో నెల్లూరు కేంద్రంగా పని చేస్తే సంస్థలో రూ.57 లక్షలు... 2015లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంస్థ నుంచి రూ.31 లక్షలు... తాజాగా ఆర్సీఐ సంస్థలో రూ.9.98 కోట్లు... వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం మిషీన్లలో నగదు నింపే బాధ్యతలు నిర్వర్తిస్తున్న కస్టోడియన్లు స్వాహా చేసిన మొత్తాలివి. ఆయా సంస్థల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలే వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. వీటినే క్యాష్ చేసుకున్న నిందితులు భారీగా నగదు పక్కదారి పట్టింస్తున్నారని చెప్తున్నారు. ప్రజాధనం దుండగుల పాలవుతున్నా... ఆయా బ్యాంకులు మాత్రం సంస్కరణలపై దృష్టి పెట్టడంలేదు. ఆర్సీఐ ఫ్రాడ్‌లో కస్టోడియన్లతో పాటు ఏకంగా యాజమాన్యం పాత్ర  వెలుగులోకి రావడంతో అధికారులే అవాక్కయ్యారు.

 
ఔట్‌సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ...

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే కాంట్రాక్టును ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టుకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. వీరు బ్యాంకులకు చెందిన కేంద్రాల నుంచి కోట్ల రూపాయలు తమ సంస్థల వాహనాల్లో తీసుకొచ్చి, ఆ మొత్తాన్ని ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషీషన్లలో డిపాజిట్ చేస్తుంటారు.

 
గతం తెలీదు.. నిఘా లేదు...
కస్టోడియన్లుగా చేరే ఉద్యోగుల పూర్తి వివరాలు ఏటీఎంలో డబ్బు నింపే కాంట్రాక్టు పొందిన సంస్థలు తమ వద్ద ఉంచుకోవడం గానీ, వారి గత చరిత్రను పరిశీలించడంగానీ చేయడం లేదు. అలాగే వారి కార్యకలాపాలపై నిఘా ఉంచట్లేదు. ఫలితంగానే నేరం వెలుగులోకి వచ్చినా.. నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరింది. ఎంత మొత్తం కార్యాలయంలో అప్పగించింది అనే అంశాలు కేవలం మాన్యువల్‌గా పుస్తకాల్లో లేదా కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు.  అలాగే, ఈ డబ్బులో ఎంత మొత్తం ఏటీఎం సెంటర్‌లో డిపాజిట్ చేశారనేది కూడా మాన్యువల్‌గానే రికార్డు చేస్తున్నారు తప్ప.. డిపాజిట్ చేసిన మొత్తాన్ని సాంకేతికంగా లెక్కించే మెకానిజంను  ఆయా సంస్థలు ఇప్పటి వరకూ అందిపుచ్చుకో లేదు.

 
అంతర్గత విచారణతో జాప్యం...

ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు డ్యూటీ దిగిన తర్వాత మళ్లీ వెళ్లి ఏటీఎంలను తెరిచినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. దీనిని ఆసరా చేసుకొని కస్టోడియన్లు ఏటీఎంల్లో అవసరమైన డబ్బు డిపాజిట్ చేశామని నమ్మిస్తూ కోట్ల రూపాయలు గోల్‌మాల్ చేస్తున్నా కాంట్రాక్టు సంస్థలు వెంటనే గుర్తించలేకపోతున్నాయి.  అప్పుడప్పుడు జరిగే ఆడిటింగ్‌లో అసలు విషయం బయటకు వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంతర్గత విచారణ పేరుతో జాప్యం చేస్తున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక పోలీసులను ఆశ్రయిస్తుండటంతో దర్యాప్తు క్లిష్టంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు.

 
ఈసారి ఏకంగా యాజమాన్యంతో కలిసి...

ఏటీఎంల్లో నగదు గోల్‌మాల్ చేస్తున్న కస్టోడియన్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి తొలినాళ్లలో కేవలం ఒకటి రెండు రోజుల సర్దుబాటు కోసం నగదు పక్కదారి పట్టించడం, ఆ తరవాత స్వాహా చేయడం పరిపాటిగా మారిందని పోలీసులు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన కేసునే తీసుకుంటే తొలుత ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేసిన కస్టోడియన్లు ఆ తర్వాత వెళ్లి మిషీన్లు ఓపెన్ చేసి, ఆ నగదును స్వాహా చేశారు. వీరిని కనిపెట్టే మెకానిజం, సీసీ కెమెరాలు ఉన్నా... కాంట్రాక్ట్ సంస్థల నిఘా లేకపోవం, నిర్లక్ష్యం వల్ల వెంటనే విషయం బయటకు రాలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్సీఐ సంస్థ విషయానికి వస్తే తొలుత సంస్థకు చెందిన కీలక వ్యక్తులే కస్టోడియన్ల ద్వారా నగదు పక్కదారి పట్టించారు. దీన్ని అదునుగా తీసుకుని ఉద్యోగులు ఆపై సొంతంగా స్వాహా చేశారు.

 

‘ఆర్సీఐ’పై పట్నాలోనూ కేసు...
ఎస్బీఐ ఏటీఎంల్లో పెట్టాల్సిన నగదు గోల్‌మాల్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్సీఐ సంస్థపై బీహార్‌లోని పట్నాలోనూ కేసు నమోదైంది. ఆ నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన 770 ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ పర్యవేక్షిస్తోంది. ఇందులో కస్టోడియన్లుగా పని చేస్తున్న రాకేష్ రాయ్, రాహుల్ కుమార్, అవినాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధర్మ్‌వీర్ కుమార్, చంద్రభాను కుమార్, అభిమన్యు కుమార్, అభిషేక్‌కుమార్, పప్పు కుమార్‌లు 27 ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.2.12 కోట్లు కాజేశారంటూ ఆర్సీఐ అధికారి చిన్మయ్ చందన్ పట్నాలోని డిఘా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు ప్రాథమికంగా ఈనెల 10న తొమ్మిది మందిపైనే ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నగరంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారంతో డిఘా పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్నాలోనూ ఆర్సీఐ యాజమాన్యమే ఫ్రాడ్ చేసి, కస్టోడియన్లపై నెడుతోందా? లేక కస్టోడియన్లతో కలిసి గోల్‌మాల్‌కు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్సీఐ సంస్థపై మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు