సరళీకృత ఆర్థిక విధానాలే శ్రీరామరక్ష

25 Jul, 2016 04:40 IST|Sakshi
సరళీకృత ఆర్థిక విధానాలే శ్రీరామరక్ష

- జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
- తైవాన్, జపాన్, సింగపూర్‌ల ఎదుగుదలకు కారణమిదే
- అప్పట్లో వాజ్‌పేయీ సాహస నిర్ణయాలు దేశగతినే మార్చాయి
- పెట్టుబడుల తరలింపుతో ఆర్థిక రంగానికి మేలు
 
 సాక్షి, హైదరాబాద్ : ‘టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ గుత్తాధిపత్యం సాగిన నాలుగు దశాబ్దాల కాలంలో దేశ జనాభాలో 0.8 శాతం మందికే టెలిఫోన్ వసతి సమకూరింది. అదే ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించిన రెండు దశాబ్దాల్లో అది 80 శాతంగా నమోదైంది. ప్రైవేటు సంస్థల ఆగమనానికి తలుపులు తెరిస్తే ప్రభుత్వరంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందేవారు గుర్తించాల్సిన విషయమిది. దేశ ప్రగతి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఓ దేశం వేగంగా ఆర్థిక పురోగతి సాధించాలంటే సరళీకృత ఆర్థిక విధానాలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోక తప్పదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 

ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జస్టిస్ కొండా మాధవరెడ్డి సంస్మరణ సభలో ఆయన కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాసం చేశారు. ‘న్యాయవ్యవస్థ-ఆర్థిక రంగం’ అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1991కి ముందు- 1991కి తర్వాత అన్నట్టుగా ఉందన్న జైట్లీ... అప్పటి వరకు మనదైన సంప్రదాయ పద్ధతిలో దేశ ఆర్థిక రంగం ముందుకు సాగగా ఆ తర్వాత సంస్కరణలతో కొత్త పుంతలు తొక్కిందన్నారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు లోతైన చర్చతో సంస్కరణలకు ఓ రూపం తెచ్చినప్పటికీ, వాటి అమలులో కొంత తటపటాయించారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ బాధ్యతలు తీసుకున్నాక దేశ ఆర్థికరంగం రూపురేఖలే మారిపోయాయన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలకు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే కారణమని కొనియాడారు.

 పెట్టుబడులు వస్తేనే ప్రగతి
 ఓచోట నుంచి పెట్టుబడులు మరోచోటకి, అక్కడి నుంచి మరో రంగానికి ఇలా పెట్టుబడుల తరలింపు ఆర్థిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు వస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. న్యాయవ్యవస్థ-ఆర్థిక వ్యవస్థ మధ్య సన్నటి విభజన రేఖ ఉందని, తాను దాన్ని సంక్లిష్ట విషయంగా భావిస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ విలువైన సూచనలు, సలహాలతో ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టేం దుకు సహకరిస్తున్నారన్నారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కంపెనీల చట్టానికి సవరణలు కోరుతూ పత్రిపాదించానని, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఆర్థిక, న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాంటి వాటిని ఉపయోగించుకోవాలన్నారు.

 కొండా శైలి స్ఫూర్తిదాయకం
 ఆసియాఖండంలోనే భాగంగా ఉన్న తైవాన్, జపాన్, సింగపూర్, కొరియాలు సరళీకృత ఆర్థిక విధానాలతో ముందుగా ప్రగతిబాటపట్టగా, ఆ తర్వాత చైనా అనుసరించిందన్నారు. తాను యువ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన సమయంలో అనుభవజ్ఞుడైన న్యాయవాదిగా కొండా మాధవరెడ్డి వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించేవాడినని అరుణ్‌జైట్లీ గుర్తుచేసుకున్నారు.అంతకుముందు ప్రతిభావంతులుగా అంతర్జాతీయస్థాయి ఖ్యాతి పొందుతున్న స్థానిక క్రీడాకారులు, చదువులో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల్‌రెడ్డి, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి, జస్టిస్ కొండా మాధవరెడ్డి తనయుడు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు