చేనేత సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం

15 Jun, 2016 00:48 IST|Sakshi

- చేనేత కార్మిక సంఘం విమర్శ
- ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర
- జూలై 1న పోచంపల్లి సభతో యాత్ర ముగింపు
 
 సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదని, చేనేత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకుడు టి.వెంకట్రాములు విమర్శించారు. చేనేత కార్మికులను చైతన్య పరిచి, సంఘటితం చేసేందుకు తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూలై 1 వరకు చేనేత బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో పి.లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకట్రాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. చేనేత సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామని, నిపుణుల కమిటీ ద్వారా చేనేతరంగ అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఈ రెండేళ్లలో వాటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చేనేతను జౌళిశాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఇంతవర కు అమలుకు నోచుకోలేదన్నారు.

 చేనేత బస్సుయాత్ర షెడ్యూలిదీ
 ఈ నెల 23 నుంచి చేపట్టే చేనేత బస్సుయాత్ర షెడ్యూలును వెంకట్రాములు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23న మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో బస్సు యాత్ర  ప్రారంభమై రెండురోజుల పాటు అదే  జిల్లాలో కొనసాగుతుంది. 25న మెదక్, 26, 27 తేదీల్లో కరీంనగర్, 28, 29 తేదీల్లో వరంగల్ జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 30న నల్లగొండ జిల్లాలో ప్రవేశించి, జూలై 1న పోచంపల్లిలో నిర్వహించే బహిరంగసభతో బస్సుయాత్ర ముగుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పెండెం సర్వేశంను చేనేత సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏశాల అశోక్, ఎం.జనార్దన్, ఎల్.యాదగిరి, జల్దిరాములు, సీహెచ్ ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు