బాధితుడే నిందితుడు...

23 Jul, 2017 08:39 IST|Sakshi
బాధితుడే నిందితుడు...
► చోరీ పేరుతో నాటకం
►  తండ్రికి తనయుడి టోకరా
 
హైదరాబాద్‌ : చేతిలో ఖరీదైన  ఎస్‌–7 ఫోన్‌.. తిరగడానికి రూ. 2 లక్షల విలువైన కేటీఎం బైక్‌. బ్యాంకులో రూ. లక్షకు పైగా నగదు నిల్వ. తండ్రి రెండు ఫారెన్‌ ఎక్సైంజ్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు. అయినా సరదాలకు అలవాటు పడి స్నేహితులతో జల్సాలు చేసేందుకు తనను దొంగలు దారి కాచి కొట్టి నగదు లాక్కుపోయారంటూ కొత్త కథ అల్లి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అత్తాపూర్‌ హైదర్‌గూడకు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ నారాయణగూడలోని చైతన్య డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు.

తండ్రి ఆరిఫ్‌ గత 20 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలో అరబిక్‌ ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తున్నాడు. వీరికి రెండు విదేశీ కరెన్సీ ఎక్సైంజ్‌ కేంద్రాలు ఉన్నాయి. అపోలో ఆస్పత్రికి వివిధ దేశాల నుంచి వచ్చే వారికి ఆరిఫ్‌ కరెన్సీ మార్చి ఇచ్చేవాడు. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం అతను ఓమన్‌ దేశస్తుడికి రూ. 2 లక్షలు ఇండియన్‌ కరెన్సీ కావాలని పెద్ద కొడుకుకు చెప్పాడు. దీంతో అతను తన సోదరుడు సల్మాన్‌కు నగదు ఇచ్చి అపోలో ఆస్పత్రికి పంపాడు. అయితే వాటిని కొట్టేయాలని పథకం పన్నిన సల్మాన్‌  అందులో ఒక లక్ష తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. ఇంకో లక్షను కాజేసేందుకు తన స్నేహితులైన అనీఫ్, అమీర్‌లతో పథకం వేశాడు. తాను బైక్‌పై వెళ్తుంటే ఆస్పత్రి సమీపంలో ఆపి కొట్టి లక్ష ఎత్తుకెళ్లాలని సూచించడంతో వారు  సల్మాన్‌ను కొట్టి జేబులో డబ్బులు లాక్కుని పరారయ్యారు.

అనంతరం సల్మాన్‌ తనను కొట్టి రూ. 2లక్షలు దోచుకెళ్లారంటూ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు సల్మాన్‌ను విచారించగా అసలు విషయం చెప్పాడు. ఇదిలా ఉండగా జల్సాలకు అలవాటుపడ్డ వీరు ముగ్గురూ పాత నేరస్తులు కాగా, పీడియాక్ట్‌ కూడా నమోదై ఉందిది. ఓ మర్డర్‌ కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు మరోసారి పథకం వేసి డబ్బులు చేజిక్కుంచుకునే వేసిన పథకం పారకపోగా పోలీసులకు చిక్కారు. నిందితులను విచారిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వీరిపై ఉన్న కేసులను తిరగదోడుతున్నారు.  
మరిన్ని వార్తలు