ఖైదీల కుటుంబాలకు శుభవార్త

7 Mar, 2016 02:43 IST|Sakshi
ఖైదీల కుటుంబాలకు శుభవార్త

సత్ప్రవర్తన గల 252 మంది విడుదలకు కేబినెట్ ఆమోదం
 

హైదరాబాద్: జైళ్లలో సత్ప్రవర్తన గల ఖైదీల విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. జీవిత ఖైదుతోపాటు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 252 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలోని కమిటీ.. విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను సిద్ధం చేసింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. ఇది ఇప్పటికే ఆలస్యమైనందున వెంటనే అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. అలాగే ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ రుణ సంస్థల నుంచి రూ.15 వేల కోట్ల రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కూడా పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగానే నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణానికి పూచీకత్తు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ముంబై పురపాలక విధానంపై అధ్యయనం చేయాలని, దీన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
 సెప్టెంబర్ నాటికి ఈ-మార్కెట్లు
 కే ంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లకు ఆన్‌లై న్ లింకింగ్‌తో (ఇ- మార్కెట్లు)గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. అందులో 44 మార్కెట్లు తెలంగాణలో ఉన్నాయి. వీటిని ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆన్‌లైన్ లింకింగ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు కేంద్రం రూ.24 కోట్లు విడుదల చేయనుంది. మరోవైపు కొత్త రిజర్వేషన్ల ప్రకారం, మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకాలకు వీలుగా చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
కేబినెట్‌లో తీసుకున్న మరిన్ని నిర్ణయాలివీ..
రాష్ట్ర ఆర్టీసీని ఆదుకునేందుకు రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు పూచీకత్తు ఇవ్వాలని నిర్ణయం
జీహెచ్‌ఎంసీలో విలీనమైన 12 శివారు మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, సీవరేజీ మౌలిక వసతుల కల్పనకు హడ్కో నుంచి రుణ సమీకరణకు ఆమోదం
కొత్త ఐటీ, మైనింగ్, కల్చరల్ పాలసీలపై చర్చించాలని నిర్ణయం
రాష్ట్రంలో కొత్తగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు. వచ్చే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయింపు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు
రాష్ట్ర సాంస్కృతిక విభాగాన్ని బలోపేతం చేసేందుకు నిర్ణయం.
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
 ఐఏఎస్ అధికారుల సంఘానికి మూడెకరాల స్థలం కేటాయింపునకు ఆమోదం
హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాలు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకునేందుకు ఆమోదం
ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, జీహెచ్‌ఎంసీతోపాటు మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను బిల్లు రూపంలో తీసుకువచ్చేందుకు ఆమోదం
  మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్, 19 అవుట్ సోర్సింగ్ పోస్టుల మంజూరు, ఆరోగ్య శాఖలో 23 పోస్టుల మంజూరు
 

మరిన్ని వార్తలు